Ram Temple Ayodhya:
70% పనులు పూర్తి..
అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 70% పనులు పూర్తయ్యాయి. ఆలయ గోపురం దాదాపు తుది రూపుకు వచ్చేసింది. ఆలయంలోని మొదటి అంతస్తు పనులు ఈ ఏడాది అక్టోబర్‌లోగా పూర్తవుతాయని ట్రస్ట్ వెల్లడించింది. వచ్చే ఏడాది మకరసంక్రాంతి నాటికి రాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించనున్నారు. అప్పటి నుంచి రాముడిని సందర్శించుకునేందుకు భక్తులకు అనుమతినిస్తారు. నిజానికి...ఆలయ నిర్మాణం పూర్తి కాకముందే...రోజూ వేలాది మంది భక్తులు ఆ ప్రాంగణం వద్దకు వస్తున్నారు. పనులు ఎలా సాగుతున్నాయో గమనిస్తున్నారు. రాముడి ఆలయంతో పాటు అదే ప్రాంగణంలో మిగతా దేవుళ్ల ఆలయాలూ నిర్మించనున్నారు. ఈ కాంప్లెక్స్‌లో సూర్యాలయం, గణేషుడి ఆలయం, హనుమాన్, అన్నపూర్ణ మాత ఆలయాలు నిర్మించాలని ట్రస్ట్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. పార్క్ వెలుపల అగస్త్య, విశ్వామిత్ర, వశిష్ఠ, మాతా శబరి, జటాయు, అహల్య ఆలయాలు నిర్మించనున్నారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో సుగ్రీవ ఆలయం కూడా నిర్మించాలని నిర్ణయించారు. శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్‌లో సుగ్రీవుని ఆలయం కూడా రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే అయోధ్యలో రామాలయ గోపురం కనిపిస్తోంది. స్తంభాలను ఎక్కడికక్కడ పేర్చడం వల్ల ఓ రూపుకు వచ్చింది. మొదటి అంతస్తు ఎత్తు దాదాపు 20 అడుగులుగా ఉండనుంది.
నేపాల్ నుంచి శిలలు..
రాముడి విగ్రహ తయారీపై ప్రత్యేక దృష్టి సారించింది రామ మందిర ట్రస్ట్. దాదాపు ఆరడుగుల రాముడి విగ్రహాన్ని తయారు చేయించి...వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి ప్రతిష్ఠించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అయితే..ఈ విగ్రహ తయారీ కోసం ప్రత్యేక శిలలు తెప్పిస్తోంది. నేపాల్ నుంచి రెండు సాలగ్రామ శిలలను తరలించారు. ఇప్పటికే ఇవి అయోధ్యకు చేరుకున్నాయి. రామ మందిర ప్రాంగణానికి చేరుకోగానే పూజారులు, స్థానికులు ఆ శిలలకు ఘనస్వాగతం పలికారు. పూలతో అలంకరించారు. పూజలు చేశారు. ఆ తరవాత ఆ శిలలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అప్పగించారు. రాముడితో పాటు సీతా దేవి విగ్రహాన్నీఈ శిలతోనే తయారు చేయనున్నారు. గర్భాలయంలో ఈ రెండు విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. నేపాల్‌లోని కలి గండకి నదీ తీరంలో ఈ శిలలను సేకరించారు. వీటిని సీతాజన్మ స్థలిగా భావించే జానక్‌పూర్ నుంచి ప్రత్యేక క్రేన్‌ల ద్వారా అయోధ్యకు తరలించారు. ఈ రెండు సాలగ్రామ శిలల్లో ఒక దాని బరువు 18 టన్నులు కాగా...మరోటి 16 టన్నులు. విగ్రహ తయారీకి ఈ రెండు శిలలు అనువుగా ఉన్నట్టు అధికారులు నిర్ధరించారు. 35 అడుగుల దూరం నుంచి చూసినా...రాముడు స్పష్టంగా కనిపిస్తాడని ట్రస్ట్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రముఖ శిల్పులు రాముడి విగ్రహాన్ని చెక్కుతున్నారు.