చాలామంది వ్యక్తులు రాత్రిపూట ఆస్తమా లక్షణాలను ఎక్కువగా అనుభవిస్తారు. కొందరిలో ఇది అధ్వానంగా మారే అవకాశం ఉంది. శ్వాస నాళాల చుట్టూ ఉన్న కండరాలు బిగుసుకుపోయి ఈ సమస్య వస్తుంది. దగ్గు ఆగకుండా వచ్చే ఛాన్సు ఉంది. రాత్రిపూట ఆస్తమా అటాక్ చేయకుండా ఉండాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా మందులను తీసుకోవాలి.
1. రాత్రి పడుకోబోయే ముందు మీరు నిద్రించే స్థలాన్ని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఫ్యాన్లు, అల్మారాలు దుమ్ము పట్టి ఉండడం మంచిది కాదు. అవన్నీ కూడా మీకు ఆస్తమా వచ్చే అవకాశాన్ని రాత్రి పూట పెంచుతాయి. దుమ్ములో అలెర్జీ కారకాలు ఎక్కువ.
2. మీరు వాడే తలగడలు, పరుపులు ఎప్పటికప్పుడు దుమ్ములేకుండా దులుపుకుంటూ ఉండండి. అలాగే డస్ట్ ప్రూఫ్ కవర్లను వాడడం మంచిది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ సైన్స్ వారు నిర్వహించిన అధ్యయనంలో బెడ్ రూమ్‌లో ఉన్న దుమ్ము పట్టిన బెడ్ షీట్లు, తలగడలు, వాటి కవర్ల వల్లే ఎక్కువగా రాత్రిపూట ఆస్తమా వస్తున్నట్టు తేలింది.
3. ఆస్తమా ఉన్నవారు తమ బెడ్ షీట్లను, పిల్లో కవర్లను ప్రతివారం వేడి నీటిలో ఉతికి ఆరేయడం మంచిది. దీని వల్ల దుమ్ములో ఉన్న సూక్ష్మక్రిములు కూడా మరణిస్తాయి.
4. చల్లని గాలి పొడిపొడిగా అనిపిస్తుంది. ఇది తీవ్రమైన ఆస్తమాకు కారణం అవుతుంది. కాబట్టి శీతాకాలంలో మీరు పడుకునే గదిలో హ్యుమడిఫైయర్ పెట్టుకోవడం మంచిది. అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకోవడం కూడా ఉత్తమం. హానికరమైన కణాలను ఇది ప్యూరిఫై చేస్తుంది.
5. పెంపుడు జంతువులకు దూరంగా ఉండండి. ముఖ్యంగా రాత్రిపూట మీ పడకగదిలోకి పెంపుడు జంతువులను రానివ్వకండి. ఆ జంతువుల నుంచి రాలే బొచ్చు కూడా ఆస్తమాను పెంచేస్తుంది.
6. రాత్రి పడుకునే ముందు ఇంట్లో ఎయిర్ ఫ్రెషనర్లు, బలమైన వాసనలు వేసే క్యాండిల్స్ వంటివి వినియోగించవద్దు. ఉబ్బసం ఉన్నవారికి ఇవన్నీ చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ఆస్తమాను ఎక్కువ చేస్తాయి.
ఆస్తమా అనేది ఒక శ్వాసకోశ వ్యాధి. ఇది మనిషికి ఊపిరి అందకుండా చేస్తుంది. పిల్లలు, పెద్ద వారిలో కూడా ఇది ఇబ్బంది పెట్టే సమస్య. ఈ వ్యాధి వల్ల శ్వాసనాళాలు సంకోచిస్తాయి. దీని వల్ల గాలి సరిగా ఆడదు. సిగరెట్, చల్లని గాలి, సుగంధాలు, పెంపుడు జంతువుల బొచ్చు, మానసిక ఆందోళన వంటి వాటి వల్ల ఆస్తమా పెరుగుతుంది.
Also read: ఇనుప కళాయిలో ఈ కూరగాయలు వండకూడదు, వండితే ఏమవుతుందంటే
Also read: ప్రఖ్యాత GI ట్యాగ్ పొందిన బనారసి పాన్, కాశీ వెళ్లినవారు కచ్చితంగా తినాల్సిన కిళ్లీ ఇది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.