కాశీనే వారణాసి అని వారణాసిని బనారస్ అని ఎంతోమంది పిలుచుకుంటారు. ఉత్తర భారత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఇది ప్రముఖ నగరం. గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ఇది ప్రసిద్ధి. అలాగే ఆహారపరంగానూ వారణాసి ఎంతో స్పెషల్. ఇక్కడ దొరికే కొన్ని రకాల ఆహారాలు చాలా ప్రత్యేకమైనవి. చాట్, కచోరి, లస్సి ఈ నగరానికే పేరు తెచ్చాయి. ఇప్పుడు ‘బనారసి పాన్’ కూడా ఈ జాబితాలో చేరింది. ఈ బనారసి పాన్ గురించి బాలీవుడ్ పాటల్లోనే కాదు ప్రసిద్ధ నవలల్లో కూడా వినిపిస్తూ ఉంటుంది. ఎట్టకేలకు ఈ పాన్ GI ట్యాగ్ సాధించింది. ఈ ప్రఖ్యాత కిళ్లీతో పాటూ ఇప్పటివరకు కాశీ నుంచి 22 ఉత్పత్తులు ఈ ట్యాగ్‌ను పొందాయి. అందులో ముఖ్యమైనవి బనారసి లాంగ్డా మామిడి, రాంనగర్ భంట్ అనే వంకాయ, ఆడమ్చిని అనే బియ్యం రకం. ఇప్పుడు బనారసి పాన్ ఈ ట్యాగ్ సాధించి వారణాసి పేరును మరింత పెంచింది.
ఏంటీ GI ట్యాగ్?
GI అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్. ఇది ఉత్పత్తులకు ఇచ్చే ప్రఖ్యాతమైన సర్టిఫికెట్. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి సంబంధించిన ఉత్పత్తులకు ఈ GI ట్యాగ్ అందిస్తారు. ఇది రావడం కష్టతరం. భారతదేశంలోని చెన్నైలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ ఆఫీసు ఉంది. ఈ ఆఫీసు వారే ఈ ట్యాగ్‌ను మంజూరు చేస్తుంది.ఈ ట్యాగ్ అందుకున్నాక వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద పేటెంట్స్, ట్రేడ్ మార్కులు వంటివి వస్తాయి. వ్యవసాయ ఉత్పత్తులు, హస్తకళలు, పారిశ్రామిక ఉత్పత్తులు, వంటకాలు... ఇలా రకరకాల ఉత్పత్తులకు GI ట్యాగ్ అందిస్తారు. ఈ ట్యాగ్ రావడం వల్ల ఆ ఉత్పత్తికి ప్రత్యేక గుర్తింపుతో పాటు విలువ కూడా పెరుగుతుంది.
బనారసి పాన్ ఎలా ఉంటుంది?
ఈ బనారసి పాన్ చాలా ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇందులో ముఖ్యమైన పదార్థం పాన్ పట్టా. ఇది తమలపాకులో ఒక రకమైనది. ఆ తమలపాకుల్లో సుపారి, గుల్కండ్, సోంపు, కేసర్ చట్నీ, చునా, కొబ్బరి, టూటీ ఫ్రూటీ, ఇలాచి, జైఫాల్ పౌడర్ వంటివన్నీ కలిపి చుట్టి ఇస్తారు. దీన్ని తింటే రుచి అదిరిపోతుంది. వారణాసి వెళ్లినవారు కచ్చితంగా ఈ పాన్‌ను రుచి చూసే వస్తారు.
భారతదేశంలో GI ట్యాగ్ పొందిన ఎన్నో ప్రత్యేక ప్రసిద్ధ ఆహారాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన డార్జిలింగ్ టీ, కొంకణ ప్రాంతానికి చెందిన ఆల్ఫోన్సో మామిడి, మహారాష్ట్రాకు చెందిన నాగ్‌పూర్ ఆరెంజ్, ఇండో గాంగటెక్ ప్రాంతానికి చెందిన బాస్మతి రైస్, కర్ణాటకకు చెందిన కూర్గ్ అరబికా కాఫీ, కర్ణాటకు చెందిన మైసూర్ పాక్, ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఆగ్రా పీఠ్, కేరళ నుంచి మలబార్ మిరియాలు, తిరుపతి లడ్డూ, రాజస్థాన్లోని బికనీర్ భుజియా, మణిపూర్ నుంచి బ్లాక్ రైస్.... ఇలా ఎన్నో ఆహారాలు ఇప్పటివరకు GI ట్యాగ్ పొందాయి.
Also read: ఇంట్లోని బియ్యం మూటలో త్వరగా పురుగులు పట్టేస్తున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే పురుగులు చేరవు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.