నట్స్, పప్పులు వంటివి నీళ్లలో నానబెట్టడం అనేది ప్రతి ఇంట్లో సాధారణంగా పాటించే పద్ధతే. అయితే నానబెట్టిన ఆ నీళ్లను చాలామంది బయట పడేస్తారు. అదే తప్పని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. పప్పులను నానబెట్టాక ఆ నీటిని తిరిగి వాడడం ఎంతో ఉత్తమమైన పద్ధతని, అది ఆరోగ్యానికి మంచిదని వివరిస్తున్నారు. 


ఎందుకు నానబెట్టాలి?
వంట చేయడానికి ముందు పప్పులను ఎందుకు నానబెట్టాలి? నానబెట్టకుండా వంట చేస్తే ఏమవుతుంది? ఏమీ కాదు. కాకపోతే నానబెట్టడం వల్ల పప్పు మరింత ఆరోగ్యకరంగా తయారవుతుంది. పప్పులు, ధాన్యాలలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. నీళ్లలో ముందుగా నానబెట్టడం వల్ల అది శరీరం గ్రహించడానికి వీలుగా విచ్చిన్నమవుతుంది. అప్పుడు జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. అందుకే వీటిని నీళ్లలో ముందుగా నానబెట్టమని చెబుతారు. అయితే ఆ నీళ్లను చాలామంది పడేస్తారు. అలా పడేయకూడదని వివరిస్తున్నారు పోషకాహార నిపుణులు. 


పప్పును నానబెట్టిన నీళ్లలో బి విటమిన్లు ఉంటాయి. ఇవి పప్పుల నుంచి నీళ్లలోకి చేరుతాయి. పూర్తిగా నీటిలో కలిసిపోతాయి. ఆ నీళ్లను పడేయడం వల్ల బి విటమిన్లు అన్నింటినీ పడేస్తున్నట్టే లెక్క. అందుకే తిరిగి ఉపయోగించుకోవాలి. పౌష్టికాహార శాస్త్రం చెబుతున్న ప్రకారం మీరు వంట చేయడానికి ఆ నీటిని తిరిగి వాడవచ్చు. నానబెట్టిన నీటిని తిరిగి పప్పును ఉడికించడానికి లేదా అన్నాన్ని ఉడికించడానికి ఉపయోగించుకుంటే మంచిది. లేదా మొక్కలకు పోసినా అవి బి విటమిన్లను శోషించుకుంటాయి. 


ఇలా చేస్తేనే...
పప్పులు నానబెట్టిన నీటిని తిరిగి వాడాలనుకుంటే ముందుగా ఆ నీళ్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. దీనికి ముందుగా ఏం చేయాలంటే... పప్పులు నానబెట్టడానికి ముందే కనీసం మూడుసార్లు కడగాలి. దీనివల్ల వాటిపై ఉన్న దుమ్ము, ధూళి అన్నీ పోతాయి. తర్వాత మంచి నీళ్లు పోసి రెండు నుంచి నాలుగు గంటలు నానబెట్టాలి. అదే చిరు ధాన్యాలు,  బాదం పప్పులు... ఇలాంటివి అయితే ఎనిమిది నుంచి పది గంటలు నానబెట్టాలి. నానబెట్టిన ఆ నీటిలో నీటిలో మైక్రో న్యుట్రియెంట్లు ఉంటాయి. పోషక ప్రయోజనాలు ఎక్కువ. ఇలా నానబెట్టి నీటిని వాడుకోవచ్చు. 


పప్పులు నానబెట్టి వండడం వల్ల సులభంగా ఆహారం జీర్ణం అవుతుంది. అలాగే పోషకవిలువలు పెరుగుతాయి. అంతేకాదు పప్పులు ముందుగా నానబెట్టడం వల్ల త్వరగా ఉడుకుతుంది. వంట సులువుగా పూర్తవుతుంది. అలాగే పప్పుల్లోని వ్యర్థాలు, విషపదార్థాలు కూడా తొలగిపోతాయి.



Also read: ఏడాదికి ఒకసారి మాత్రమే పండే పంట హిమాలయన్ వెల్లుల్లి, దీని ధర అదిరిపోతుంది



Also read: నా సోమరిపోతు భర్త ఇంటి పనుల్లో సహాయం చేయడం లేదు, అతడిని మార్చుకోవడం ఎలా?





















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.