ప్రశ్న: నేనూ, నా భర్తా ఇద్దరమూ ఉద్యోగం చేస్తాము. నేను ఇంటి పనులు అన్నీ చేసి ఉద్యోగానికి వెళ్తాను. నా భర్త ఉదయం లేచినప్పటి నుంచి బ్రష్, స్నానం వంటి తన పనులు తప్ప ఇంటి పనులు ఏమీ చేయడు. కనీసం సహాయ పడదామని కూడా ఆలోచించడు. తాను భోజనం చేసిన ప్లేట్ కూడా సింక్ లో వేయడానికి ఇష్టపడడు. నేను అతని పని మనిషిగా భావిస్తున్నట్టు అనిపిస్తుంది. పిల్లలను చూసుకుంటూ, ఉద్యోగం చేస్తూ, ఇంట్లో అన్ని పనులు నేనే చేయడం కష్టంగా ఉంది. ఏదైనా సహాయం చేయమని అడిగితే... తను చేయలేనని, ఉద్యోగంలో ఒత్తిళ్లు అధికంగా ఉన్నాయని... ఇలా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నాడు. పని మనిషిని కూడా పెట్టడు. నేను ఆ ఇంటికి వంట మనిషి, పనిమనిషిలా తయారయ్యాను. ఆరోగ్యపరంగా కూడా అంత శక్తివంతంగా లేను. అన్ని పనులు చేసి అలసిపోతున్నాను. నా భర్త బద్ధకాన్ని వదిలించడం ఎలా?


జవాబు: ఎక్కువ ఇళ్లల్లో కనిపించే సమస్య ఇదే. చాలా తక్కువ మంది మగవారు మాత్రమే తమ భార్యలకు ఇంటి పనుల్లో, వంటపనుల్లో సాయం చేస్తారు.  కొంతమంది అది తమ పని కాదని, అది ఆడవాళ్ళ పని అని విడతీసుకుని, గిరి గీసుకొని కూర్చుంటారు. దానికి కారణం పూర్వం నుంచి వచ్చిన నమ్మకాలు, పద్ధతులే. పురుషులు బయటికి వెళ్లి కష్టపడి సంపాదించి తెచ్చేవారు, స్త్రీలు ఇంట్లోనే ఉండి ఇంటిని, పిల్లల్ని చూసుకోవడం బాధ్యతగా ఉండేది. దీనివల్ల పురుషులు బయట పనులు, స్త్రీలు ఇంట్లో పనులు చూసుకోవడం అనేది అలవాటుగా మారింది.  ఇప్పుడు కాలం మారింది. స్త్రీలు ఉద్యోగానికి వెళ్తున్నారు, కానీ ఇళ్ల పనుల్లో మాత్రం వారికి బాధ్యతలు తగ్గడం లేదు. వంట, ఇంటి పనులు కేవలం స్త్రీలకే అని ఇంకా ఎంతో మంది పురుషుల నమ్మకం. నిజానికి ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు భార్యాభర్తలు ఇద్దరూ సమానంగా పంచుకోవాల్సినవి. ఇద్దరూ సమానంగా కష్టపడితేనే రోజులు గడిచే కాలం ఇది. ఇంటికి ఇద్దరు కలిసి సంపాదిస్తున్నట్టే, ఇంట్లోని పనులను కూడా ఇద్దరూ షేర్ చేసుకోవాలి. ఇదే విషయాన్ని మీ భర్తతో కూర్చుని మాట్లాడండి. వంట, గిన్నెలు తోమడం లాంటివి ఆయనకు చేయడం ఇష్టం లేకపోతే, ఆయనకు ఇంట్లో ఏ పనులు సులువుగా అనిపిస్తాయో వాటిని మొదట చేయమని వివరించండి. కూరగాయలు, వంట సరుకులు తేవడం లాంటి బయట పనులను పూర్తిగా అతనికే అప్పగించండి.


జీవితం ఒక నావ లాంటిది. భార్యాభర్తలిద్దరూ నావను నడపగలిగితేనే జీవితం సవ్యంగా సాగుతుంది. ఆ విషయం అతనికి అర్థం అయ్యేలా వివరించాల్సిన బాధ్యత మీకు ఉంది. మీరు చెబుతున్న సమస్య చిన్నదే కానీ, మీ స్థానంలో ఉండి ఆలోచిస్తే... మీరు శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడుతున్న విషయం అర్థం అవుతుంది. ఆ కష్టాన్ని మీ భర్తకు మీరు కమ్యూనికేట్ చేయగలిగితే మంచిది. మీకు ఒత్తిడి అధికమైతే అది ఇంటి మొత్తం మీద పడుతుందని ఆయనకి అర్థం కావాలి. మీపై పడుతున్న ఒత్తిడి తగ్గించడానికి ఆయన ఇంటి పనుల్లో సాయం చేయాలని వివరించండి. లేదా మానసిక వైద్యులను కలిసి ఆయనకు కౌన్సిలింగ్ ఇప్పించండి.  ముఖ్యంగా ఈ విషయంలో  మీ ఇంట్లోని పెద్దల సాయం ముందుగా తీసుకోండి. మీ అత్తయ్య, మీ మామయ్యకు మీ పరిస్థితిని వివరించండి. వారి చేత చెప్పించండి. 


Also read: ముద్దు పెట్టుకుంటే వచ్చే వ్యాధి ఇది - దీనివి దాదాపు కోవిడ్ లక్షణాలే