Mutual Funds: 2022-23 ఆర్థిక సంవత్సరం మొత్తంలో, మ్యూచువల్ ఫండ్స్ భారతీయ స్టాక్ మార్కెట్‌లో రూ. 1.82 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాయి, ఇది ఒక రికార్డు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో, భారత స్టాక్ మార్కెట్‌లో మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు పెట్టిన రూ. 1.81 లక్షల కోట్ల విలువైన రికార్డ్ ఇప్పుడు తుడిచి పెట్టుకుపోయింది. మ్యూచువల్ ఫండ్స్‌లోకి, ముఖ్యంగా మన లాంటి రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న పెట్టుబడుల ట్రెండ్ పెరుగుతూనే ఉంది. 2022లో స్టాక్ మార్కెట్‌లో క్షీణత కనిపించినా, మ్యూచువల్ ఫండ్ల మీద పెట్టుబడిదార్లు నమ్మకం కొనసాగించారు. దానివల్ల రికార్డు స్థాయి పెట్టుబడులు ఈక్విటీల నుంచి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌లోకి మళ్లాయి.
స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI) వెబ్‌సైట్‌లో ఉన్న డేటా ప్రకారం... గత ఆర్థిక సంవత్సరంలో (2022-23) రిటైల్ ఇన్వెస్టర్లు సహా వివిధ వర్గాల నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు పెరగడం వల్ల, ఆయా సంస్థలు స్టాక్ మార్కెట్‌లో రూ. 1.82 లక్షల కోట్లు విలువైన షేర్లను కొనుగోలు చేశాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.81 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టిన ఫండ్ హౌస్‌లు, అంతకుముందు, 2020-21 ఆర్థిక సంవత్సరంలోని కరోనా కాలంలో మార్కెట్ నుంచి రూ. 1.20 లక్షల కోట్లను వెనక్కు తీసుకున్నాయి.
మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్
మ్యూచువల్ ఫండ్స్ ఇంత భారీ స్థాయిలో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయని మార్కెట్ ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు. ముందుగా, ఇటీవలి స్టాక్ మార్కెట్ పతనం కారణంగా వివిధ క్వాలిటీ స్టాక్స్‌లో వాల్యుయేషన్లు దిగొచ్చి ఆకర్షణీయంగా మారాయి. ఈ కారణంగా సంస్థాగత పెట్టుబడిదార్లు ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడంపై చాలా సానుకూలంగా ఉన్నారు. మార్కెట్ ఒడిదొడుకుల మధ్య నేరుగా షేర్లలో ఇన్వెస్ట్ చేసి రిస్క్ తీసుకునే కంటే, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడమే బెస్ట్ ఆప్షన్‌గా రిటైల్ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
'సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్' (SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఉత్తమ ఎంపికగా మారింది. 2022 క్యాలెండర్ సంవత్సరంలో, SIP ద్వారా ప్రతి నెలా సగటున 12,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు, ప్రతి నెలా ఆ పెట్టుబడి 13000 కోట్ల రూపాయలను దాటింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FIIs) భారతీయ స్టాక్ మార్కెట్‌లో భారీ స్థాయి అమ్మకాలకు దిగినప్పటికీ, మ్యూచువల్ ఫండ్స్ వంటి సంస్థాగత పెట్టుబడిదార్ల కారణంగా భారత మార్కెట్లో పెద్దగా క్షీణత కనిపించ లేదు. గత ఆర్థిక సంవత్సరంలో విదేశీ ఇన్వెస్టర్లు ఇండియన్ ఈక్విటీల్లో రూ. 37,600 కోట్ల పెట్టుబడులు పెట్టారు, రూ.1.40 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.