సీజనల్ ఫుడ్‌ను తినమని చెబుతారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే సీజనల్‌గా పండే పంటలు, పండ్లు మన శరీరానికి వేసవి తాపాన్ని తట్టుకునే శక్తిని ఇస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలా వసంతకాలంలో పండే పంట హిమాలయన్ వెల్లుల్లి. దీన్నే కాశ్మీరీ వెల్లుల్లి అని, జమ్మూ వెల్లుల్లి అని పిలుస్తారు. అలాగే దీన్ని ‘స్నో మౌంటెన్ గార్లిక్’ అని కూడా అంటారు. చూడటానికి ఇవి పొట్టిగా, బంగారు రంగులో ఉంటాయి. మనం నిత్యం వాడే వెల్లుల్లికి కాస్త భిన్నమైన రూపంలో కనిపిస్తాయి. ఒక్కోటి ఒకటిన్నర సెంటీమీటర్ నుంచి నాలుగు సెంటీమీటర్ల మధ్య వరకు పెరుగుతాయి. దీని రుచి మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది. ఇది దొరికితే తినమని సిఫారసు చేస్తున్నారు  పోషకాహార నిపుణులు. వీటిలో సాధారణ వెల్లుల్లితో పోలిస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ. 


హిమాలయన్ వెల్లుల్లిలో మాంగనీస్, విటమిన్ బి6, విటమిన్ సి, రాగి, సెలీనియం, ఫాస్ఫరస్ వంటివన్నీ పుష్కలంగా లభిస్తాయి. అలాగే కాల్షియం, విటమిన్ బి1 అధికంగా ఉంటాయి. ఈ వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికం. అధిక కొలెస్ట్రాల స్థాయిని తగ్గించడానికి కూడా ఈ వెల్లుల్లిలోని పోషకాలు సహాయపడతాయి. హిమాలయన్ వెల్లుల్లి తినడం వల్ల మన రక్తనాళాల్లో ఫలకాలు ఏర్పడడం, రక్తం  గడ్డ కట్టడం వంటి సమస్యలు రావు. దీనివల్ల గుండెకు కూడా ఆరోగ్యం. ఈ వెల్లుల్లి మన కండరాలను సడలించడంలో సహాయపడుతుంది. దీనివల్ల రక్తపోటు పెరగదు.


ఈ వెల్లుల్లిలో హైడ్రోజన్ సల్ఫైడ్ అనే మరో రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలోని సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటును తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇందులో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఎక్కువ. దీనిలో E.coli, ఆంత్రాక్స్ వంటి బ్యాక్టీరియాలను చంపే శక్తి ఉంది. ఎన్నో వైరస్, శిలీంధ్రాలకు వ్యతిరేకంగా ఇది పోరాడగలదు. వెల్లుల్లిలో ఉండే అల్లిసన్ సమ్మేళనం ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఇస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు సహాయపడుతుంది. ఎన్నో రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. 


మధుమేహం వంటి రోగాల బారిన పడిన వారికి ఈ వెల్లుల్లి అద్భుత ఔషధం అనేది చెప్పాలి. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి ప్యాంక్రియాస్‌ను ఇవి ప్రేరేపిస్తాయి. తద్వారా శరీరం మధుమేహంతో పోరాడటానికి సహాయపడుతుంది. సాధారణ వెల్లుల్లి పోలిస్తే దీని ధర అధికం. కేవలం పావుకిలో అయిదు వందల రూపాయల దాకా ఉంటుంది. 



Also read: నా సోమరిపోతు భర్త ఇంటి పనుల్లో సహాయం చేయడం లేదు, అతడిని మార్చుకోవడం ఎలా?





















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.