దేశంలో కరోనా కేసులు, అందులో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మందులు ఇష్టారీతిన వాడకం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 
మితిమీరిన మందుల వాడకంపై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కొన్ని మందులను సూచించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వాళ్లు వీటిని ఉపయోగించ వచ్చని పేర్కొన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వాళ్లు జ్వరం వస్తే పారాసెటమాల్, దగ్గు వస్తే ఆయుష్‌ సిరప్‌ వాడొచ్చని సలహా ఇచ్చారు. 
"జ్వరానికి పారాసెటమాల్ ఇస్తాం. దగ్గుకు ఆయుష్ సిరప్‌ వాడొచ్చు. హోం ఐసోలేషన్‌లో ఉన్న రోగులకు మేం సూచించే మందులివే. దగ్గు మూడు రోజుల కంటే ఎక్కువ ఉంటే బుడెసోనైడ్‌ అనే ఇన్‌హెల్లర్‌ వాడొచ్చు. ఈ మూడింటిని వాడితే చాలు" - డా. వీకే పాల్‌


వీటితోపాటు వేడినీళ్లను పుక్కిలిస్తూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటే చాలు అంటున్నారు వీకే పాల్. 







ఆసుపత్రిలో చేరే వాళ్లకు  వినియోగించాల్సిన మందులపై స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని దాని ప్రకారమే ట్రీట్‌మెంట్‌ చేయాలన్నారాయన. ఇచ్చిన గైడ్‌లైన్స్‌ ప్రకారమే డెక్సామెథాసోన్ మరియు రెమెడిసివిర్ వాడాలని తెలిపారు వీకే పాల్‌.


"రోగులు ఆసుపత్రిలో చేరినప్పుడు ఆక్సిజన్ అవసరమైనప్పుడు రూల్స్‌కు అనుగుణంగా మిథైల్ప్రెడ్నిసోలోన్ లేదా డెక్సామెథాసోన్ మెడిసిన్ వాడాలి. హెపారిన్‌ను కూడా ఆసుపత్రుల్లో వైద్యులే ఇస్తారు. రెమ్‌డెసివిర్‌కి ఇచ్చేందుకు కూడా  స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ మందులను ఇంట్లో తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అది మరింత ప్రమాదకరం. మితిమీరిన వినియోగం ఆందోళన కలిగిస్తోంది." - డా. వీకే పాల్‌


అత్యుత్తమ వైద్య నిపుణులతో ఈ ప్రోటోకాల్‌  డెవలప్‌ చేశామని... మందుల దుర్వినియోగం ఆందోళన కలిగిస్తోందన్నారు డాక్టర్ వీకే పాల్. 


ఎక్కువ స్టెరాయిడ్స్ వాడకం వల్ల మ్యూకోర్మైకోసిస్ వచ్చే అవకాశం ఉందన్నారు వీకే పాల్. స్టెరాయిడ్స్‌కు ప్రాణాలను రక్షించే శక్తి  ఉందని... అదే టైంలో వాటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయన్ననారు. రోగనిరోధక శక్తిని తగ్గించి బాడీలోని జీవప్రక్రియలకు భంగం కలిగిస్తాయని తెలిపారు. 


ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకొని స్టెరాయిడ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు వీకేపాల్. కరోనా ప్రోటోకాల్‌ ప్రకారం మందులు వేసుకొని కరోనా నుంచి క్షేమంగా బయటపడాలన్నారు.




Also Read: Covid 19 Lockdown: ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ.. లాక్‌డౌన్ విధిస్తారా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి