ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం భేటీ కానున్నారు. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతోన్న వేళ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సీఎంలతో మోదీ చర్చించనున్నారు.


2020లో కరోనా సంక్షోభం మొదలైన సమయంలో సీఎంలతో ప్రధాని మోదీ పలు దఫాలు చర్చించారు. ఆ సమయంలో లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో ఈసారి జరగనున్న భేటీలో అలాంటి నిర్ణయం ఏమైనా తీసుకుంటారేమోనని చర్చ నడుస్తోంది. కానీ ఇప్పటికే దేశ ఆర్థిక రంగం తీవ్రంగా దెబ్బతింది. మళ్లీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మరింతగా దిగజారే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 


గురువారం సాయంత్రం 4.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనుంది.


కీలక భేటీ..



దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ.. ఉన్నతాధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. థర్డ్‌వేవ్ ప్రభావంతో దేశవ్యాప్తంగా కేసుల పెరుగుదల, వైరస్ కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం వంటి అంశాలపై ప్రధాని మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు సమాచారం.

 

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ భేటీలో ఆరోగ్యశాఖ, కొవిడ్ వర్కింగ్ గ్రూప్ నిపుణులు, ఇతర మంత్రిత్వశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

పెరిగిన కేసులు..

 

దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 1,94,720 కరోనా కేసులు నమోదయ్యాయి. 442 మంది వైరస్‌తో మృతి చెందారు. 60,405 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,46,30,536కు పెరిగింది.


మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868కి పెరిగింది. ఇందులో 1805 మంది రికవరయ్యారు.





ఒమిక్రాన్ కేసుల సంఖ్యలో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో 1281 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. దిల్లీని దాటి రాజస్థాన్ రెండో స్థానానికి వచ్చింది. రాజస్థాన్‌లో 645 ఒమిక్రాన్ కేసులు ఉండగా దిల్లీలో 546 ఉన్నాయి. 




చాలా రాష్ట్రాల్లో మంగళవారం కరోనా కేసులు పెరిగాయి. బంగాల్‌లో 21,098 మందికి కరోనా సోకింది. దీంతో మరోసారి రోజువారి కేసుల సంఖ్య లక్ష మార్కు దాటింది. తమిళనాడులో 15,379 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో 9,066 కేసులు నమోదయ్యాయి.


పండుగ సీజన్ కావడంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించాలని లేకుంటే మరో దారుణమైన కరోనా వేవ్ చూడాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు.






Also Read: Covid 19 Lockdown: ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ.. లాక్‌డౌన్ విధిస్తారా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి