ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం భేటీ కానున్నారు. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతోన్న వేళ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సీఎంలతో మోదీ చర్చించనున్నారు.


2020లో కరోనా సంక్షోభం మొదలైన సమయంలో సీఎంలతో ప్రధాని మోదీ పలు దఫాలు చర్చించారు. ఆ సమయంలో లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో ఈసారి జరగనున్న భేటీలో అలాంటి నిర్ణయం ఏమైనా తీసుకుంటారేమోనని చర్చ నడుస్తోంది. కానీ ఇప్పటికే దేశ ఆర్థిక రంగం తీవ్రంగా దెబ్బతింది. మళ్లీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మరింతగా దిగజారే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 


కీలక భేటీ..


దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ.. ఉన్నతాధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. థర్డ్‌వేవ్ ప్రభావంతో దేశవ్యాప్తంగా కేసుల పెరుగుదల, వైరస్ కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం వంటి అంశాలపై ప్రధాని మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు సమాచారం.


వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ భేటీలో ఆరోగ్యశాఖ, కొవిడ్ వర్కింగ్ గ్రూప్ నిపుణులు, ఇతర మంత్రిత్వశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  


కీలక నిర్ణయం..



కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న కంటైన్‌మెంట్ జోన్లలోని ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించారు. కంటైన్‌మెంట్ జోన్ జాబితా నుంచి తొలగించాకే కార్యాలయానికి రావాలని సూచించింది.

 

కేసులు..

 

దేశంలో కొత్తగా 1,68,063 కరోనా కేసులు నమోదుకాగా 277 మంది మృతి చెందారు. 69,959 మంది తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 8,21,446కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 2.29%గా ఉంది. రికవరీ రేటు 96.36%గా ఉంది.


మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4461కి చేరింది. మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.


Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!


Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి