ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు మాత్రం ప్రొబేషన్ డిక్లేర్ చేయకపోవడంతో గ్రామ, వార్డు సచివాలయాల స్టాఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 3 నెలలు తమ ప్రొబేషన్ వెనక్కిపోయిందని, ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. తమకు న్యాయం చేయాలంటూ వారు నిరసన తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగ సంఘాలు నిరసనకు పిలుపునివ్వడంతో నెల్లూరు జిల్లాలో ఉద్యోగులు విధులను బహిష్కరించి ప్రదర్శనలు చేపట్టారు. 




ప్లకార్డులతో ప్రదర్శనలు..
నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం, కోవూరు సహా.. దాదాపు అన్ని మండలాల్లో సచివాలయ ఉద్యోగులు ఈరోజు విధులకు హాజరు కాకుండా మండల కేంద్రాలకు వచ్చారు. ప్లకార్డులు చేతబట్టుకుని రోడ్లపై నిరసన ప్రదర్శనలు చేశారు. ఎంపీడీవో కార్యాలయాలకు వచ్చి, అక్కడ వినతిపత్రాలు ఇచ్చారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని కోరారు. 




రూ.15వేల జీతంతో నెట్టుకురాలేం..
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు రోడ్డెక్కారు. విధులను బహిష్కరించి ఎంపీడీవో ఆఫీస్ ల వద్ద ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని, ప్రొబేషన్ వెంటనే డిక్లేర్ చేయాలని డిమాండ్ చేశారు. 15వేల నెలజీతంతో జీవనం ఇబ్బందిగా మారిందని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఉద్దేశం తమకు లేదని, కానీ తమ హక్కులకోసం ఇలా రోడ్డెక్కాల్సి వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో తమ సమస్యలు పరిష్కరించాలని ప్రొబేషన్ డిక్లేర్ చేసి, జీతాలు పెంచాలని కోరారు. కోవూరు మండలంలోని సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఎంపీడీవో కార్యాలయానికి ప్రదర్శనగా తరలి వచ్చారు. ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించారు. 




కరోనా టైమ్ లోనూ కష్టపడ్డాం.. 
కరోననా కష్టకాలంలోనూ తాము సిన్సియర్ గా విధులు నిర్వహించామని కనీసం తమ కష్టానికి తగిన గుర్తుంపుని ఇవ్వాలని కోరుతున్నారు సచివాలయ ఉద్యోగులు. చాలామంది ఎక్కువ జీతాలు వచ్చే ప్రైవేటు ఉద్యోగాలు సైతం వదులుకుని సచివాలయాల్లో కుదురుకున్నామని రెండేళ్ల తర్వాత జీతాలు పెరుగుతాయని ఆశించామని, కానీ ఇలా ప్రొబేషన్ ని పొడిగించడం సరికాదంటున్నారు సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. రెండేళ్ల తర్వాత ప్రొబేషన్ పూర్తవుతుందని ఆనాడు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు తమకు న్యాయం చేయాలని, వెంటనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లాగే తమకు కూడా పీఆర్సీ వర్తింపజేయాలన్నారు ఉద్యోగులు. 


ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు అధికారులు ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూప్ ల నుంచి లెఫ్ట్ అవుతూ తమ నిరసన తెలియజేశారు. తాజాగా విధులను సైతం బహిష్కరించి ఎంపీడీవో కార్యాలయాల్లో వినతిపత్రాలు అందించి ప్రత్యక్ష కార్యాచరణ లోకి వచ్చారు. మరి ప్రభుత్వం ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తుందా..? లేక ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందా..? వేచి చూడాలి. 


 Also Read: RGV Tickets Issue : టిక్కెట్ల ఇష్యూలో " బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?" అనే ప్రశ్న వస్తుందన్న ఆర్జీవీ ! దీని అర్థం ఏమిటి ?


Also Read: నాలుగు గంటల భేటీ మధ్యలో రొయ్యల బిర్యానీ లంచ్ ! చివరికి ఏమి తేల్చారంటే ? 


Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్! నేడు మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. మీ ప్రాంతంలో తాజా ధరలు ఇవీ..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి