భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న కేప్‌టౌన్‌లో జరుగుతున్న మూడో టెస్టు సమయం గడిచేకొద్దీ ఆసక్తికరంగా సాగుతోంది. రెండో రోజు టీ బ్రేక్ సమయానికి దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. కీగన్ పీటర్సన్ (70 బ్యాటింగ్: 159 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీయగా.. ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీలకు రెండేసి వికెట్లు దక్కాయి.


100-3 స్కోరుతో లంచ్ తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వాన్ డర్ డసెన్ (21: 54 బంతుల్లో) అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 112 పరుగులు కాగా.. వాన్ డర్ డసెన్, కీగన్ పీటర్సన్ కలిసి నాలుగో వికెట్‌కు 67 పరుగులు జోడించారు.


ఈ సమయంలో కీగన్ పీటర్సన్‌కు ఫాంలో ఉన్న టెంపా బవుమా (28: 52 బంతుల్లో) జత కలిశాడు. వీరిద్దరూ 16 ఓవర్ల పాటు వికెట్ పడకుండా కాపాడారు. అయితే ఐదో వికెట్‌కు 47 పరుగులు జోడించాక.. ఈ భాగస్వామ్యాన్ని మహ్మద్ షమీ విడదీశాడు. షమీ వేసిన అవుట్ స్వింగర్‌ను ఆడబోయి బవుమా స్లిప్‌లో విరాట్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇదే ఓవర్లో కైల్ వెర్నేన్‌ను (0: 2 బంతుల్లో) కూడా షమీ అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా 159 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.


ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కో జాన్సెన్ (7: 26 బంతుల్లో), కీగన్ పీటర్సన్ ఏడు ఓవర్లు వికెట్ పడకుండా ఆపారు. అయితే టీ బ్రేక్‌కు ముందు చివరి ఓవర్లో బుమ్రా బౌలింగ్‌లో జాన్సెన్ అవుట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా ఇంకా 47 పరుగులు వెనకబడి ఉంది. భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ (79: 201 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్.


ఈ సిరీస్‌లో మొదటి రెండు టెస్టుల్లో భారత్, దక్షిణాఫ్రికా చెరొకటి గెలిచాయి. దీంతో సిరీస్ 1-1తో సమం అయింది. ఈ టెస్టులో ఎవరు విజయం సాధిస్తే వారికే ట్రోఫీ దక్కనుంది.