కేప్‌టౌన్‌ టెస్టుపై దక్షిణాఫ్రికా పట్టు బిగించేలా కనిపిస్తోంది! రెండో రోజు లంచ్‌ విరామానికి ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. రసి వాన్‌ డర్‌ డుసెన్‌ (17; 42 బంతుల్లో) నిలకడగా ఆడుతున్నాడు. కీగన్‌ పీటర్సన్‌ (40; 86 బంతుల్లో 7x4) అర్ధశతకం వైపు సాగుతున్నాడు. టీమ్‌ఇండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం సఫారీ జట్టు 123 పరుగుల లోటుతో ఉంది.


ఓవర్‌నైట్‌ స్కోరు 17/1తో సఫారీ జట్టు రెండోరోజైన గురువారం బ్యాటింగ్‌ ఆరంభించింది. వేసిన రెండో బంతికే అయిడెన్‌ మార్‌క్రమ్‌ (8; 22 బంతుల్లో)ను జస్ప్రీత్ బుమ్రా క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. కానీ నైట్‌ వాచ్‌మన్‌గా వచ్చిన కేశవ్‌ మహరాజ్‌ (25; 45 బంతుల్లో 4x4) టీమ్‌ఇండియాను చికాకు పెట్టాడు. చక్కని బౌండరీలు బాదేస్తూ స్కోరును పెంచాడు. జట్టు స్కోరు 45 వద్ద అతడిని ఉమేశ్‌ పెవిలియన్‌కు పంపించాడు.


Also Read: IPL New Sponsor: వివో ఔట్‌! ఇకపై 'టాటా ఐపీఎల్‌'! చైనా కంపెనీకి గుడ్‌బై!!


Also Read: IPL Auction 2022 Date: క్రికెటర్లూ కాచుకోండి! ఇక డబ్బుల పండగే!! ఫిబ్రవరి 12, 13న ఐపీఎల్‌ మెగా వేలం


Also Read: Tata Group IPL Sponsor: మైదానంలో సిక్సర్ల వర్షం.. బీసీసీఐకి కాసుల వర్షం..! టాటా రావడంతో బోర్డుకు ఎంత డబ్బు వస్తోందంటే?


ఆ తర్వాత వికెట్లు తీసేందుకు టీమ్‌ఇండియా బౌలర్లు ఎంత శ్రమించినా ఫలితం దక్కలేదు. కీగన్‌ పీటర్సన్‌ అత్యంత విలువైన ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ బౌండరీలు రాబడుతున్నాడు. అర్ధశతకానికి చేరువయ్యాడు. అతడికి డుసెన్‌ తోడుగా ఉన్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 88 బంతుల్లో 55 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో స్కోరు పెరిగింది.


అంతకు ముందు టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (79) ఒంటరి పోరాటం చేశాడు. సెంచరీ చేసే అవకాశం చేజార్చుకున్నాడు. అవతలి ఎండ్‌లో భాగస్వాములు పెవిలియన్‌కు వరుస కట్టడంతో.. వేగంగా ఆడే క్రమంలో ఔట్‌సైడ్‌ ఎడ్జ్‌ రూపంలో రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. చెతేశ్వర్‌ పుజారా (43) అర్ధశతకానికి చేరువై వెనుదిరిగాడు. రిషబ్ పంత్ (27) ఫర్వాలేదనిపించాడు. కేఎల్‌ రాహుల్‌ (12), మయాంక్ అగర్వాల్‌ (15), అజింక్య రహానె (9), అశ్విన్‌ (2), శార్దూల్‌ ఠాకూర్‌ (12), ఉమేశ్‌ 4, షమీ 7 పరుగులు చేశారు.