ఇండియాలో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గలేదు. గత రెండున్నర నెలలుగా దాదాపుగా ప్రతిరోజూ 30 నుంచి 35 వేల వరకు కొవిడ్19 కేసులు నమోదవుతున్నాయి. నిన్నటితో పోల్చితే కరోనా కేసులతో పాటు మరణాలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు యాక్టివ్ కరోనా కేసులు 151 రోజుల కనిష్టానికి చేరుకున్నాయి.  గడిచిన 24 గంటల్లో తాజాగా 17,21,205 మందికి కొవిడ్19 పరీక్షలు నిర్వహించగా.. 34,457 మందికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అదే సమయంలో మరో 375 మంది కరోనా మహమ్మారికి చికిత్స పొందుతూ చనిపోయారు. 


151 రోజుల కనిష్టానికి యాక్టివ్ కేసులు


దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 50,45,76,158 (50 కోట్ల 45 లక్షల 76 వేల 158) శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తాజా ప్రకటనలో తెలిపింది. దేశంలో ప్రస్తుతం 3 లక్షల 61 వేల 340 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. గడిచిన 151 రోజులలో ఇవి కనిష్ట క్రియాశీలక కరోనా కేసులు అని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. మరోవైపు నిన్నటితో పోల్చితే కరోనా కేసులు 2 వేల మేర తక్కువగా నమోదయ్యాయి. రికవరీ రేటు 98 శాతానికి చేరువలో ఉంది.
Also Read: ZyCoV-D Vaccine: దేశంలో మరో టీకాకు అనుమతి.. 'జైకోవ్‌-డీ'కి డీసీజీఐ గ్రీన్ సిగ్నల్


తాజా కేసులో కలిపితే దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3.23 కోట్లకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 375 మంది చనిపోగా, మొత్తం కరోనా మరణాల సంఖ్య 4.33 లక్షలకు చేరుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు నిన్న ఒక్కరోజు 36 వేల మంది కొవిడ్19 నుంచి కోలుకుని ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. కోలుకున్న మొత్తం బాధితుల సంఖ్య 3.15 కోట్లుగా ఉంది. గత రెండున్నర నెలల నుంచి దేశంలో నమోదవుతున్న కొత్త కరోనా కేసులలో సగం కేరళ నుంచి వస్తున్నాయి. దీనిపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో కరోనా టీకాలు తీసుకోవడమే అత్యుత్తమ మార్గమని, అర్హులైన అందరూ కొవిడ్19 వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read: ఫీవర్‌ వచ్చినంత మాత్రాన కంగారు పడొద్దు.. ఈ లక్షణాలు ఉంటే మీరు భయపడాల్సిన పనే లేదు..


నిన్న ఒక్కరోజులో దేశ వ్యాప్తంగా 36.36 లక్షల మంది కరోనా టీకాలు తీసుకున్నారు. ఇప్పటివరకూ 57,61,17,350 (57 కోట్ల 61 లక్షల 17 వేల 350) కోట్ల డోసులను రాష్ట్రాలకు పంపిణీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. రాష్ట్రాల వద్ద ఇంకా నిల్వలు ఉన్నాయని తెలుస్తోంది. థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో డీసీజీఐ జైకోవ్ డీ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి శుక్రవారం అనుమతి ఇచ్చింది. గుజరాత్‌ కేంద్రంగా ఈ టీకాలు ఉత్పత్తి అవుతున్నాయి.