Corona News: 2019 నుంచి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భూతం మళ్లీ నిద్రలేచింది. కొవిడ్‌ -19 ఉపజాతికి చెందిన ఈ కొత్త వేరియంటన్‌కు వైద్యులు XECగా పిలుస్తున్నారు. జర్మనీలో ఈ జున్‌లో ఈ గ్జెక్ వేరియంట్ కేసు నమోదు కాగా మూడు నెలల వ్యవధిలోనే 27 దేశాలకు పాకింది. అమెరికాలో దాదాపు 12 రాష్ట్రాల్లో ఈ గ్జెక్ వేరియంట్ కేసులు నమోదు అవుతుండగా.. యూరఫ్‌ మొత్తం ఈ కేసులు వెలుగు చూస్తున్నాయి. గ్జెక్ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉండగా సమీప భవిష్యత్‌లో ఇదో ఉపద్రవంగా పరిణమించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తొలుత జర్మనీలో.. ఆ తర్వాత డెన్మార్క్‌, యూకే, యూఎస్‌కు విస్తరించినట్లు స్క్రిప్స్‌ నివేదిక వెల్లడించింది. ఐరోపా, ఉత్తర అమెరికా, ఆసియా దేశాల్లో ఈ వేరియంట్ ఆనవాళ్లు ఉన్నాయని కొవిడ్ డేటా విశ్లేషకుడు మైక్‌ హనీ వివరించారు. డెన్మార్క్‌, జర్మనీలో వైరస్ తీవ్రత అధికంగా ఉండగా.. దాదాపు 15 దేశాలు దీనిని అధికారికంగా గుర్తించాయి.


ఆగస్టు నెల నుంచి విజృంభిస్తున్న గ్జెక్ వేరియంట్‌:


ఆగస్టు 19 నాటికి యూరోపియన్ కరోనా కేసులలో గ్జెక్ కేసులు అత్యధికంగా 5.09 శాతంగా ఉన్నాయని.. స్లొవేకియా శాంపిల్స్‌లో 10 శాతం ఈ కొత్త వేరియంట్‌వేనని తేలింది. కేఎస్‌ 1.1, కేపీ 3.3 వేరియంట్లు కలిసి ఈ కొత్త రకం గ్జెక్ వేరియంట్ పుట్టుకొచ్చినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ గ్జెక్ వేరియంట్ వైరస్ సోకితే.. బాధితులకు తీవ్రమైన అలసట, తల నొప్పి, గొంతు నొప్పి, అధిక జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. ఈ కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తూ ప్రబలమైన అంటు వ్యాధిగా రూపాంతరం చెందుతోందని.. లండన్‌లోని యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ జెనెటిక్స్‌ ప్రొఫెసర్‌ ఫ్రాంకోయిస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న టీకాలు.. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను అడ్డుకున్నట్లే ఈ గ్జెక్ వేరియంట్‌ను కూడా సమర్థంగా అడ్డుకోగలవని అంచనా వేశారు. అయితే ప్రభుత్వాలు, ఆరోగ్య వ్యవస్థలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ మహమ్మారిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని.. మార్గదర్శకాలు రూపొందించిన టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేయడం సహా రద్దీ ప్రదేశాల్లో మాస్క్ వినియోగించడం వంటి కార్యక్రమాలు తిరిగి చేపట్టాలని ఫ్రాంకోయిస్ సూచించారు.






గతంలో టీకా తీసుకున్నా గ్జెక్ కట్టడికి మళ్లీ అవసరం:


గ్జెక్ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్న వేళ.. గతంలో టీకా తీసుకున్నా తీసుకోక పోయినా మళ్లీ వ్యాక్సినేషన్ చేయించుకోవడం ఉత్తమం అని వైద్య నిపుణులు అంటున్నారు. ఆరు నెలల వయస్సున్న వారి నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ 2024- 2025లో తయారైన కొత్త రకం టీకాలు వేయించుకోవడం ద్వారా ఈ గ్జెక్ విస్తరణ నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు. డెన్మార్క్, జర్మనీలో 17 శాతం కరోనా కేసులు గ్జెక్‌వేనని.. యూకే, నెదర్లాండ్స్‌లో ఈ కేసుల సంఖ్య 11 నుంచి 13 శాతంగా ఉందని.. కొత్త టీకాల ద్వారా దీని విస్తరణను అడ్డుకోవాలన మైక్ హనీ వివరించారు. గతంలో సమ్మర్ ఆఫ్ కొవిడ్‌గా పిలిచిన KP 3.1.1 వేరియంట్ వేగంగా 80 దేశాలకు విస్తరించినప్పటికీ సమర్థంగా అడ్డుకోగలిగామని అన్నారు. ఇప్పుడు గ్జెక్ వేరియంట్ వెలుగు చూడగా ఇందులో మరిన్ని మ్యుటేషన్లు కూడా జరిగే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు.


Also Read: భారత ప్రధాని మోదీని కలిసేందుకు ట్రంప్ ఉత్సాహం.. ఎందుకంటే..?