కరోనా వైరస్ ప్రభావం ఇంకా కొనసాగుతోందని మహమ్మారి ముప్పు తప్పిపోయిందని భావించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తో పాటు పలు ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మరోవైపు దేశంలో దాదాపు గత నెలన్నర రోజులుగా నిత్యం 40 వేల వరకు కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు సైతం తగ్గడం లేదు. చిన్నారులపై కరోనా మహమ్మారి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రభావం చూపుతుందని వైద్య, ఆరోగ్య నిపుణులు తెలిపారు.
ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ అనంతరం చిన్నారులకు కరోనా థర్డ్ వేవ్ రూపంలో ముప్పు పొంచి ఉందని వదంతులు వ్యాపించాయి. నిపుణులు సైతం దీనిపై స్పందిస్తూ ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో నిపుణులు చిన్నారుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో తల్లిదండ్రులు ఇంటి వద్ద నుంచి జాబ్ చేయడం ద్వారా చిన్నారులలో మానసిక, ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
చిన్నారులలో మానసిక సమస్యలతో పాటు ఇతరత్రా సమస్యలు తలెత్తుతున్నాయని పీడియాట్రీషియన్ డాక్టర్ మీనా జే పీటీఐతో మాట్లాడుతూ తెలిపారు. తల్లిదండ్రులు ఇంటి వద్ద నుంచి జాబ్ చేస్తున్నప్పటికీ పిల్లలకు అధిక సమయం కేటాయించకపోవడంతో చిన్నారుల ప్రవర్తనలో భారీ మార్పులు వస్తున్నాయని చెప్పారు. రెండు నుంచి మూడేళ్ల వయసు చిన్నారులు అప్పుడప్పుడే చిన్న చిన్న మాటలు మాట్లాడుతారని, అయితే తల్లిదండ్రులు వారికి స్పందించడం లేదన్నారు. వారు బాత్రూమ్‌కు వెళ్లాలంటే పేరెంట్స్ వద్దకు వెళ్లకుండా పడక తడిపేస్తున్నారు. వారితో పేరెంట్స్ సమయం గడపకపోవడం కారణంగా మాటలు సైతం సరిగా రావడం లేదని కొన్ని కేసులు గుర్తించినట్లు తెలిపారు.
టీనేజీ చిన్నారులను గమనిస్తే వారు తల్లిదండ్రులు, పెద్దవాళ్ల నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. త్వరగా ఆవేశానికి లోనవుతున్నారని, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు గుర్తించారు. కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ సమయంలో స్నేహితులను కలవకుండా ఉన్నారని, కానీ సెకండ్ వేవ్ సమయంలో ఇది మరింతగా పెరగడంతో వారి ప్రవర్తనలో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త వారిని పలకరించకపోవడం, ఎవరైనా వారితో మాట్లాడాలని ప్రయత్నించినా సరైన సమాధానాలు చెప్పకపోవడం లాంటి అనారోగ్య సమస్యలు చిన్నారులు, టీనేజీ పిల్లలలో గుర్తించారు. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన సమయంలోనూ చిన్నారులు తమకు ఏం కావాలో సైతం నోరువిప్పి చెప్పడానికి భయపడుతున్నారని డాక్టర్ వెల్లడించారు.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కట్టడికి విధించిన లాక్‌డౌన్ సమయంలో చిన్నారులలో అధికంగా అనారోగ్య సమస్యలు తలెత్తాయి. చిన్నారులకు కరోనా సోకుతుందనే భయం కారణంగా, మరోవైపు తల్లిదండ్రులు వారికి సమయం వెచ్చించక పోవడంతో సమస్యలు వస్తున్నాయని మరో డాక్టర్ చెప్పారు. గతంలో స్నేహితులు, స్కూల్‌కు ఎక్కువ కాలం దూరంగా ఉండకపోవడంతో చిన్నారులలో ఈ మార్పులు వచ్చాయన్నారు. తల్లిదండ్రులు చిన్నారులు ఏం చేస్తున్నారు, వారి ప్రవర్తనను గమనిస్తూ వారిలో భయాన్ని పోగొట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.