ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి ఎర్ర చీమల చట్నీ... కరోనా నివారణకు ఉపయోగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. అసలేంటీ ఎర్ర చీమల చట్నీ?


ఇంట్లో ఎర్రచీమలు కనిపిస్తే తుడిచి పారేస్తాం. కానీ కొన్ని గిరిజన తెగల ప్రజలు మాత్రం వాటిని ఔషధాల్లా భావిస్తారు. వాటి కోసం అడవిలోకి వేటకు వెళతారు. చీమల పుట్టలు కనపడగానే, గుప్పిళ్లతో చీమల్ని తీసి సంచిలో వేసి ఇంటికెళతారు. ఇంట్లోని ఆడవాళ్లు పచ్చిమిర్చి కలిపి చీమల పచ్చడి చేసి పెడతారు. ఆ చట్నీని చాలా ఇష్టంగా తింటారు వాళ్లు. ఇది కేవలం వారికి ఆహారపదార్థమే కాదు, దివ్యౌషధంలా భావిస్తారు. దీన్ని తింటే ఫ్లూ, దగ్గు, జలుబు, శ్వాస సమస్యలు తొలగిపోతాయని వారి నమ్మకం. పై లక్షణాలు కరోనా వైరస్ లో కనిపిస్తాయి కనుక, ఆ మహమ్మారి నివారణకు కూడా ఈ చీమల చట్నీ పనిచేస్తుందని కొంతమంది ఆ ప్రాంతాలకు చెందిన విద్యావంతులు కూడా నమ్ముతున్నారు. 


ఒడిశాకు చెందిన ఓ ఇంజినీర్ నయాధర్ పడియాల్ ఇదే విషయాన్ని తెలియజేస్తూ కోర్టులో పిల్ దాఖలు చేశాడు. కరోనా చికిత్సకు ఎర్రచీమల చట్నీని కూడా వాడేందుకు అధ్యయనం చేయాలని కోరుతూ ఆయన కోర్టులో పిల్ దాఖలు చేశాడు. ఒడిశా హైకోర్టు ఆ పిటిషన్ ను స్వీకరించి ఎర్రచీమల చట్నీ కరోనా నివారణకు ఉపయోగపడుతుందో లేదో అధ్యయనం చేయాలంటూ ఆయుష్ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. దీనికి మూడు నెలల  గడువు ఇచ్చింది. 


ఈలోగా పిటిషనర్ సుప్రీంకోర్టుకు వెళ్లాడు. సుప్రీం కోర్టు ధర్మాసనం ఆ పిటిషన్ ను కొట్టివేసింది. పురాతన కాలం నుంచి ఇళ్లల్లో చాలా సంప్రదాయ పద్దతులు ఉంటాయని, వాటన్నింటినీ దేశవ్యాప్తంగా ఆచరించేలా చేయలేమని చెప్పింది. అంతేకాదు ఇంటి చిట్కాలు వాడిన వారు, దాని పర్యవసనాలు వారే అనుభవించాల్సి ఉంటుందని అంది. ఇంతవరకు టీకా తీసుకోకుండా తాత్సారం చేసిన పిటిషనర్ నయాధర్ ను వెంటనే తీసుకోవాలని కోరింది.  


నయాధర్ గతేడాదే ఎర్రచీమల చట్నీతో కరోనా తగ్గుతుందంటూ ప్రకటించారు. అప్పట్నించి కోర్టులో పోరాటం చేస్తున్నారు. ఈ చట్నీలో విటమిన్ బి12, ప్రొటీన్, ఫార్మిక్ యాసిడ్, జింక్, ఐరన్ ఉంటాయని అవి కరోనాపై పోరాడే శక్తిని ఇస్తాయని వాదిస్తున్నాడాయన. ఒడిశా, ఛత్తీస్ ఘడ్, అసోం, హిమాచల్ ప్రదేశ్ లాంటి దేశాల్లోని గిరిజనులు ఈ చీమల చట్నీతోనే ఆరోగ్యంగా ఉన్నారని చెబుతున్నాడు. 


Also read: ఏ దేవుడికి ఏ పూలతో పూజ చేస్తే మంచిది?


Also read: ఈ అష్ట వినాయకులను దర్శిస్తే... విజయాలన్నీ మీవే