తెలుగువారి ఇళ్లల్లో పూజలకు ప్రాధాన్యత ఎక్కువ. రోజూ ఇష్ట దేవుడి ముందు దీపం పెట్టనిదే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టని భక్తులు కూడా ఉన్నారు. భక్తులకు ఇష్టమైన దైవాలున్నట్టే, ఆ దేవతలకూ కూడా ఇష్టయిష్టాలున్నాయి. ఒక్కో దేవుడు ఒక్కో పువ్వును ఇష్టపడతారు. ఆ పూలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి. 


1. శివుడు - ఉమ్మెత్త 


ఉమ్మెత్త చెట్లకు గుండ్రంగా ముళ్లతో కూడిన కాయల్లాంటివి కాస్తాయి. అవంటే శివుడికి మహా ఇష్టం. మహాశివుడు గరళం తాగినప్పుడు ఉమ్మెత్త అతని ఛాతీపై దర్శనమిస్తుందని అంటారు. వాటితో పూజ చేస్తే  అహం, శత్రుత్వం వంటి గుణాలు నశించి ప్రశాంతమైన జీవితం సొంతమవుతుంది. 


2. కాళీ మాత - ఎర్ర మందారం


కాళీ మాత నాలుక రంగులో పూచే పూలు ఎర్రమందారాలు. ఆ రంగు కాళీమాతలోని ధైర్యాన్ని, సాహసాన్ని సూచిస్తాయి. 108 ఎర్ర మందారాలతో మాల కట్టి కాళీ మాత మెడలో వేసి నమస్కరిస్తే కోరిక కోరికలు తీరుతాయంటారు. 


3. మహా విష్ణువు - పారిజాతాలు


సువాసన వెదజల్లే పారిజాత పూలంటే శ్రీ మహావిష్ణువుకు మహా ప్రీతి. క్షీరసాగర మథనం జరిగేటప్పుడు పారిజాత వృక్షం పుట్టిందని, దాన్ని విష్ణువు తనతో పాటూ స్వర్గానికి తీసుకెళ్లారని చెబుతారు. ఆ పూలతో పూజిస్తే విష్ణువు మనసు మంచులా కరిగి సిరిసంపదలను ప్రసాదిస్తాడు. 


4. లక్ష్మీ దేవి - కలువ పూలు


ఐశ్వర్యానికి అధిదేవతైన లక్ష్మీ దేవి కలువ పూవులోనే అనునిత్యం కూర్చుని సేదతీరుతుంది. ఆమెకు ఇష్టమైన పువ్వు కూడా కమలమే.  లక్ష్మీ దేవిని కమలాలతో పూజించి ఆమె కృపకు పాత్రులు కండి. 


Also read: పంచభక్ష్య పరమాన్నాలు అంటే ఇవే...


5. వినాయకుడు - ఎరుపు బంతిపూలు


ఎరుపు, నారింజ రంగుల్లో ఉండే బంతిపూలంటే ఉండ్రాళ్ల ప్రియుడు వినాయకుడికి చాలా ఇష్టం. బంతిపూలు పాజిటివిటీని పెంచుతాయి. వినాయకుడికి ఎర్ర బంతిపూలతో మాల కట్టి పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి. 


6. సరస్వతీ దేవి - మోదుగు పూలు


చదువుల దేవత సరస్వతికి పూజ చేసేటప్పుడు కచ్చితంగా మోదుగు పూలు ఉండేలా చూసుకోండి. ఈ పూలు జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి. మోదుగు పూలతో పూజ చేస్తే మీకు మంచి విద్యాబుద్ధులను సరస్వతీ దేవి ప్రసాదిస్తుంది. 


7.  శ్రీకృష్ణ భగవానుడు - తులసి


శ్రీకృష్ణుడికి తులసి మొక్కంటే చాలా ఇష్టం. తులసి పూలంటే మరీ ఇష్టం. ప్రసాదాన్ని పెట్టి తులసి పూలతో పూజిస్తే మీ సమస్యలు తీరి, సర్వ సుఖాలు లభిస్తాయి. 


Also read: పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే వెజిటబుల్ పాన్ కేక్