అరటి పండ్లను ఉడకబెట్టి తింటున్నట్టు ఎంతో మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాంటి చాలా రీల్స్ ట్రెండింగ్ లోకి వచ్చాయి.  మన భారతదేశంలో అరటిపండును ఉడికించి తినడం అనేది అలవాటు లేదు. కానీ విదేశాల్లో మాత్రం ఇది వాడుకలో ఉన్న పద్ధతే. ఇలా అరటిపండును ఉడికించి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.


 అరటి పండును తొక్కతోపాటు ఐదు నుండి పది నిమిషాలు నీళ్లలో ఉడకబెడతారు. అలా ఉడకబెట్టాక అరటిపండు మరింత మృదువుగా, తీయగా, క్రీమ్ ‌లా మారుతుంది. ఆ అరటిపండు పై తేనె చల్లుకొని, పీనట్ బటర్ పూసుకొని తింటూ ఉంటారు. ఇది యువతకు బాగా నచ్చేసింది. థాయిలాండ్లో ఉడికించిన అరటిపండ్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అరటి పండ్లను మెత్తగా ఉడికించాక,  వాటిని మెత్తగా చేసి, కొబ్బరిపాలతో కలిపి వాళ్ళు డిసర్ట్ ‌లు తయారు చేస్తూ ఉంటారు. అరటిపండ్లను అల్పాహారంగా తినాలనుకుంటే లేదా సాయంత్రం స్నాక్ గా తినాలనుకుంటే గుర్తుంచుకోవాల్సిన విషయం, అందులో ఉండే క్యాలరీ కంటెంట్. వీటిని అతిగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది.


తింటే లాభమే
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం అరటిపండును ఉడకబెట్టడం వల్ల అందులోని పోషకాలు పెరుగుతాయి. ఉడకబెడుతున్నప్పుడు వచ్చే వేడి అరటిపండు తొక్కలోని గోడలను విచ్ఛిన్నం చేస్తుంది. అందులో ఉన్న విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లను అరటి పండులోని గుజ్జు లాక్కుంటుంది. అలా అవన్నీ కూడా ఈ అరటిపండును తినడం వల్ల మన శరీరానికి చేరే అవకాశం ఉంది. అలాగే ఉడకబెట్టడం వల్ల అరటిపండు లో ఉండే పిండి పదార్థం పెరుగుతుంది. ఇది స్థిరమైన శక్తిని మన శరీరానికి అందిస్తుంది. ఉడకబెట్టిన అరటిపండు తినడం వల్ల మానసిక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతారు. మానసిక ఆందోళన తగ్గించి విశ్రాంతిని ఇస్తుంది. ఇలా ఉడకబెట్టిన అరటిపండును తినడం వల్ల  చక్కెర కలిపి పదార్థాలను తినాలన్న కోరిక తగ్గుతుంది.  అనారోగ్యకరమైన స్నాక్స్ కు దూరంగా ఉంచుతుంది.


అరటి పండ్లను ఉడకబెట్టి తినడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. అవి తింటే సులభంగా జీర్ణం అవుతాయి. పచ్చి అరటిపండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది తిన్నాక కొంతమందికి జీర్ణం కావడం కష్టం అవుతుంది. అదే అరటి పండ్లను ఉడికిస్తే ఆ ఫైబర్ విచ్చిన్నం అవుతుంది. దీనివల్ల జీర్ణ ప్రక్రియ సులభతరంగా మారుతుంది. అంతేకాదు అరటిపండు పోషకాలను శరీరం చాలా సులభంగా గ్రహిస్తుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఉడికించిన అరటిపండు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. 



Also read: జుట్టు రాలడం ఆగిపోవాలా? ఉల్లిపాయ రసంతో ఇలా చేయండి
































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.