మెరిసే జుట్టు కావాలని ఎవరు మాత్రం కోరుకోరూ? జుట్టు పొడవుదా, పొట్టిదా అనే విషయం అనవసరం. ఒత్తుగా ఉండాలని మాత్రం అందరూ ఆశిస్తారు. కానీ ఆధునిక కాలంలో వాయు కాలుష్యం వల్ల, తినే తిండి వల్ల... కారణం ఏదైనా జుట్టు అధికంగా రాలిపోతుంది. రాలిపోతున్న జుట్టును కాపాడుకోవడం కోసం ఎంతోమంది ఎన్నో రకాల హెయిర్ మాస్కులు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే పెద్దగా ఖర్చు లేకుండానే రాలిపోతున్న జుట్టును కాపాడుకోవచ్చు. ఎలా అంటే ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించడం ద్వారా. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకొని బలంగా మార్చుకోవచ్చు. ఉల్లిపాయ రసంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు అధికం.  ఇవి వెంట్రుకలను బలంగా మారుస్తాయి.


ఉల్లిపాయ రసంలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు విరగడం, రాలిపోవడాన్ని నిరోధించే సమ్మేళనం. వెంట్రుకలు కుదుళ్ళ నుంచి బలంగా పెరగడానికి సల్ఫర్ సహాయపడుతుంది. ఉల్లిపాయ రసం తలకు పట్టిస్తే వెంట్రుకలు తెల్లబడడం కూడా తగ్గిపోతుంది.


బట్టతల ఉన్నవారు?
బట్టతల అనేది జన్యుపరంగా, వారసత్వంగా వచ్చేది. దీన్ని ఇలాంటి ఇంటి చిట్కాల ద్వారా అడ్డుకోవడం అసాధ్యం. ఈ ఉల్లిపాయ రసం చిట్కా సాధారణంగా జుట్టు రాలుతున్న వారికి మాత్రమే పనిచేస్తుంది. బట్టతల ఉన్నవారు వైద్యులను కలిసి దానికి తగిన చికిత్సలు తీసుకోవడం ఉత్తమం.


ఉల్లిపాయ రసంలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇవి కాలిన గాయాలు, దద్దుర్లు, చికాకు పెట్టే చర్మ సమస్యలకు చెక్ పెడతాయి. అలోపేసియా అరేట అనేది జుట్టు రాలడానికి కారణమయ్యే వ్యాధి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇలాంటి  సమస్య ఉన్నవారు కూడా ఉల్లిపాయ రసాన్ని రాయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అలాంటి సమస్యలు ఉన్న వారు సొంత చికిత్సలు చేసుకోవడం చాలా ప్రమాదకరం, పడకపోతే అది అలెర్జీలుగా మారి ఇబ్బంది పెట్టే అవకాశం పెరుగు తుంది. ఆటోఇమ్యూన్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలి.


అయితే కొంతమందికి ఉల్లిపాయ రసం పడకపోవడం, దాన్ని రాయడం వల్ల ఇతర సమస్యలు రావడం వంటివి జరగవచ్చు. ఇలాంటివారు ముందుగా జాగ్రత్తపడాలి. చర్మవ్యాధి నిపుణులను  సంప్రదించి దాన్ని ఉపయోగించడం మంచిది. ప్రతి ఒక్కరికీ ఈ ఉల్లిపాయ రసం అద్భుతంగా పనిచేస్తుందని చెప్పలేం. కొందరికి భిన్నంగా ప్రతిస్పందించవచ్చు. కాబట్టి ఉపయోగించే ముందు ఆచితూచి అడుగు వేయడం మంచిది. 



Also read: నా భర్తకు బై పోలార్ డిసార్డర్, ఆ విషయాన్ని దాచి పెళ్లి చేశారు, ఇప్పుడు నేనేం చేయాలి?




Also read: పిల్లలతో మరీ కఠినంగా ఉంటున్నారా? అలా చేస్తే వారిలో మానసిక సమస్యలు వచ్చే అవకాశం





























































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.