పెరిగే  పిల్లలకు ప్రతిదీ కొత్తే. కొత్త విషయాలను అన్వేషించడం, ఏదో ఒకటి కనిపెట్టేందుకు ప్రయత్నించడం, ఇంట్లో ఉన్న అన్ని వస్తువులను పరిశీలించడం చేస్తూ ఉంటారు. కాలు ఒక దగ్గర నిలవదు, నోరు ఆగదు. ఇవన్నీ కూడా తల్లిదండ్రులకు ఒక్కోసారి చికాకును కల్పిస్తాయి. వారిని క్రమశిక్షణలో పెట్టాలని భావిస్తారు. ఆ క్రమశిక్షణలో భాగంగా పిల్లలపై తరచూ అరవడం, కొట్టడం, ఒంటరిగా వదిలేయడం వంటి పనిష్మెంట్లు ఇస్తుంటారు. ఒక కొత్త అధ్యయనం ప్రకారం ఇలాంటి పనులు తల్లిదండ్రులు తరచూ చేస్తుంటే అది పిల్లలపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా శాశ్వతమైన మానసిక సమస్యలకు కారణం అవుతుంది. కాబట్టి కఠినమైన క్రమశిక్షణ అమలు చేయడం ఇంట్లో మానేయాలి. 


ఎపిడెమియాలజీ అండ్ సైక్రియాట్రిక్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో పిల్లలపై తల్లిదండ్రులు తరచూ కోప్పడడం, కఠినంగా వ్యవహరించడం అనేది వారిలో ఒకటిన్నర రెట్లు ఎక్కువగా మానసిక సమస్యల బారిన పడడానికి కారణం అవుతుందని తేలింది. ముఖ్యంగా తొమ్మిదేళ్ల లోపు పిల్లలపైనే ఈ ప్రభావం అధికంగా ఉంది. ఈ అధ్యయనంలో భాగంగా 7500 మంది ఐరిష్ పిల్లలను పరిశీలించారు.


ప్రతి పదిమంది పిల్లల్లో ఒకరు ఇలాంటి కఠినమైన క్రమశిక్షణను తల్లిదండ్రుల నుంచి ఎదుర్కొంటున్నట్టు అధ్యయనం తెలిపింది. వారు మానసిక సమస్యల బారిన పడే వారిలో హైరిస్క్ కేటగిరీలో ఉన్నారని అధ్యయనం చెబుతోంది. ఇంట్లో ప్రతికూల భావోద్వేగ వాతావరణం పిల్లల్లో మానసిక అనారోగ్యాలకు కారణం అవుతుందని, అది నివారించాలని కూడా అధ్యయనకర్తలు చెబుతున్నారు. 


ఈ అధ్యయనం కోసం పిల్లలను మూడు భాగాలుగా విభజించారు. ఆ మూడు భాగాల్లో మూడేళ్ల లోపు వారు ఒక వర్గం, ఐదేళ్ల లోపు రెండో వర్గం, తొమ్మిదేళ్లలోపు మూడో వర్గంగా విభజించారు. తల్లిదండ్రులు వారిపై ప్రవర్తించే తీరును విశ్లేషించారు. పిల్లలపై తల్లిదండ్రుల ప్రవర్తన మానసికంగా ఎంతగా ప్రభావం చూపిస్తుందో వివరించారు. తొమ్మిదేళ్లలోపు పిల్లలకే కఠిన క్రమశిక్షణ తీవ్ర ప్రభావమే చూపిస్తున్నట్టు గుర్తించారు. 


పిల్లల సైకాలజీ ప్రకారం ఏదైనా వారికి నేర్పాలన్నా, వినేటట్టు చేయాలన్న ప్రేమగానే చెప్పాలి. కఠినంగా గద్ధించినట్టు చెప్పడం వల్ల వారికి నేర్చుకోవాలన్న ఆసక్తి కలగదు. వారితో ఎంత ఫ్రెండ్లీగా ఉంటే, వారు అంతగా తల్లిదండ్రులుగా దగ్గరవుతారు. పిల్లలు ఆడుతూ, పాడుతూనే ఏదైనా నేర్చుకుంటారు, కుదురుగా కూర్చోమంటే వారి వల్ల కాదు. అందులోనూ పదేళ్ల లోపు పిల్లలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. 




Also read: వేసవిలో కచ్చితంగా తీసుకోవలసిన ఆహారాలు ఇవే, బరువు తగ్గడం ఖాయం


Also read: రోటీని నేరుగా మంట మీద కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా?



























































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.