వేసవి ప్రారంభమైందో లేదో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ శరీరం కష్టపడటం కూడా ఎక్కువ అవుతుంది. ఆహారాన్ని తక్కువ తీసుకోవడం మొదలుపెడతాం. కాబట్టి వేసవిలోనే బరువు తగ్గడం సులువు. బరువు తగ్గాలనుకున్నవారు వేసవిలో ఈ ఐదు ఆహారాలను కచ్చితంగా తీసుకోండి. 


సీజనల్ పండ్లు
వేసవిలో దొరికే సీజనల్ పండ్లను కచ్చితంగా భోజనంలో భాగం చేసుకోవాలి. పుచ్చకాయలు, మామిడి, బెర్రీలు వంటివి వేసవిలో అధికంగా దొరుకుతాయి. వాటిలో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. నీటి శాతం కూడా ఎక్కువే. పుచ్చకాయ, పైనాపిల్, పీచెస్ వంటివి మన శరీరాన్ని హైడ్రేటింగ్‌గా ఉంచేందుకు ఉపయోగపడతాయి. అవి తినడం వల్ల అందే క్యాలరీలు తక్కువే. కొవ్వు శాతం సున్నా. కాబట్టి వాటిని తినడం ద్వారా శరీరంలో నీటి స్థాయిని కాపాడుకుంటూనే బరువు తగ్గొచ్చు.


సత్తుపానీయం, పెరుగు
సత్తు పిండితో చేసే పానీయం వేసవిలో కచ్చితంగా తాగాల్సినది. ఇది శరీరాన్ని చల్లబరచడంతో పాటు డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. ఈ పానీయం నిండా పోషకాలే. ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి నరాల వ్యవస్థను కాపాడతాయి. పెరుగును కూడా మధ్యాహ్న భోజనంలో కచ్చితంగా తినాల్సినదే. ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఈ పెరుగు జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.  నోటి దుర్వాసనను దూరం పెడుతుంది. ఈ రెండూ కూడా శరీర బరువును పెంచవు. పైగా తగ్గిస్తాయి.


సలాడ్‌లు
పండ్లు లేదా కూరగాయలతో చేసిన సలాడ్‌ను రోజూ తినాలి. ఇది తేలికపాటి ఆహారం. శక్తిని మాత్రం అందిస్తుంది. మొలకలు, కాలే, పాలకూర వంటివి శరీరానికి విటమిన్ Aను అందిస్తాయి. హానికరమైన యువీ కిరణాల నుండి కాపాడతాయి. ఎండ నుంచి చర్మ సంరక్షణకు సహాయపడతాయి. కాబట్టి సలాడ్లను ప్రతి సాయంత్రం తినేలా చూసుకోండి. 


ఐస్ టీ, కాఫీలు
వేసవిలో టీలు, కాఫీలు తాగడం మానుకోవాలి. ఇందులో ఉండే కెఫిన్ వల్ల శరీరం త్వరగా నీటిని కోల్పోతుంది. వీటికి బదులు ఐస్ కాఫీలు, టీలు తాగడం మంచిది. ఇవి మూడ్‌ను కూడా మారుస్తాయి. శరీరంలో ఉత్సాహాన్ని నింపుతాయి. కూల్ డ్రింక్స్‌కి బదులు ఐస్ కాఫీ తాగడం వల్ల ఉపయోగం ఉంటుంది. పుదీనా, నిమ్మకాయలు వంటివి జోడించిన చల్లని టీలు తాగితే ఇంకా మంచిది. 


కొబ్బరినీళ్లు
వేసవిలో కొబ్బరినీళ్ళకు మించిన ఔషధం లేదు. వీటిలో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. వడదెబ్బ తగలకుండా, శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడతాయి. రోజుకో కొబ్బరి బోండం తాగిన చాలు, రోజంతా శరీరంలో వేడి పెరగకుండా అడ్డుకోవచ్చు. కొబ్బరినీళ్లు తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. 




Also read: రోటీని నేరుగా మంట మీద కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా?

























































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.