రోటీ లేదా చపాతి అనేది భారతీయ భోజనంలో భాగమైపోయింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో రోటీ లేదా చపాతీ లేనిదే వారికి భోజనం పూర్తికాదు. భారతీయ రొట్టెగా ఈ రెండూ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. అయితే ఇందులో చపాతీని నూనె వేసి కాలుస్తారు, కానీ రోటీని మాత్రం నూనె లేకుండానే కాలుస్తారు. చపాతీని పెనంపై కాలిస్తే, రోటీని కొంతమంది నేరుగా మంట మీద పెట్టి కాలుస్తారు. ముందుగా పెనంపై ఒక నిమిషం కాల్చి ఆ తర్వాత ఆ రోటీని మంట మీదకి మారుస్తారు. అధిక ఉష్ణోగ్రత వద్ద ఇలా  రోటీని కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చడం వల్ల హెటెరోసైక్లిక్ అమైన్‌లు (HCAలు), పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌లను (PAHs) ఉత్పత్తి అవుతాయని, అవి క్యాన్సర్ కారకాలని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. 


ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ టెక్నాలజీ అనే జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం పొయ్యిలు, కుక్ టాప్‌లు కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి వాయు కాలుష్యాలను విడుదల చేస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం ఇవి ఆరోగ్యకరమైన వాయువులు కాదు శ్వాసకోశ అనారోగ్యాలకు, గుండె నరాలకు సంబంధించిన వ్యాధులకు ఇవి కారణం అవుతాయి. అలాగే క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతాయి. న్యూట్రిషన్ అండ్ క్యాన్సర్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం అధిక ఉష్ణోగ్రత వద్ద చేసిన వంట క్యాన్సర్ కారకంగా మారుతుందని ఎన్నో అధ్యయనాలు తెలిపాయి. 


పూర్వం పటకారు కనిపెట్టకముందు చపాతీలను, రోటీలను కిచెన్ టవల్‌తో నొక్కడం లేదా వత్తడం ద్వారా వాటిని వండేవారు. కాబట్టి మధ్యలో వాటికి నేరుగా మంటతో సంబంధం లేకుండా కాస్త సమయం అయినా ఉండేది. కానీ ఎప్పుడైతే పటకారు కనిపెట్టారో, చక్కగా దాంతో పట్టుకొని నేరుగా మంట మీద పెట్టి రెండు వైపులా కాల్చేస్తున్నారు. దీని వల్ల ఎక్కువ సమయం ఆహార పదార్ధం తీవ్రమైన మంటకు గురవుతుంది. ఇది క్యాన్సర్ కారకాలు పుట్టడానికి కారణం అవుతుంది. 


‘ఫుడ్ స్టాండర్డ్స్ ఆస్ట్రేలియా - న్యూజిలాండ్’ సంస్థలో పనిచేసిన చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ పాల్ బ్రాండ్ 2011లో ఇదే విషయంపై ఒక నివేదికను తయారు చేశారు.  గోధుమపిండిలో నిర్దిష్ట స్థాయిలో సహజ చక్కెర, ప్రోటీన్ కూడా ఉంటాయి. వీటిని నేరుగా మంటపై వేడి చేసినప్పుడు క్యాన్సర్ కారక రసాయనాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు అది మానవ వినియోగానికి సురక్షితం కాదని ఆయన తన పరిశోధనలో చెప్పారు. కాబట్టి పెనం మీద కాల్చిన చపాతీలను తినడం సురక్షితం. నేరుగా మంట మీద కాల్చిన రోటీలకు దూరంగా ఉండడం బెటర్. 




Also read: బొప్పాయి తినడం వల్ల నిజంగా గర్భస్రావం జరుగుతుందా? ఇది ఎంతవరకు నిజం


















































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.