పేదవాడి పండుగా చెప్పుకుంటారు బొప్పాయి పండును. ఇది ఎక్కడపడితే అక్కడే పెరుగుతుంది, ఆరోగ్యపరంగా కూడా ఇది ఎన్నో పోషకాలను అందిస్తుంది. ఎప్పటినుంచో ప్రజల్లో ఉన్న నమ్మకం బొప్పాయి పండు తినడం వల్ల గర్భం ధరించడం కష్టమవుతుందని, అలాగే గర్భం ధరించాక తింటే గర్భస్రావం జరుగుతుందని అంటారు. ఇది ఎంతవరకు నిజమో వైద్యులు వివరిస్తున్నారు.


బొప్పాయి పండుని అధికంగా తినడం వల్ల లేదా పచ్చి బొప్పాయిని తినడం వల్ల అబార్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని శాస్త్రీయంగా కూడా నిరూపణ అయింది. అయితే బాగా మగ్గిన బొప్పాయి పండు ముక్కను తినడం వల్ల మాత్రం ఎలాంటి నష్టం జరగదు. అయితే పచ్చి బొప్పాయిని తింటే మాత్రం గర్భస్రావం జరగొచ్చు. ఎందుకంటే పచ్చి బొప్పాయిలో పపాయన్ అనే ఎంజైమ్ అధికంగా ఉంటుంది. ఈ ఎంజైమ్ గర్భసంచిని ముడుచుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల అబార్షన్ అయ్యే అవకాశాలు ఏర్పడతాయి. పచ్చి బొప్పాయిని లేదా సగం పండిన బొప్పాయిని మాత్రం గర్భిణీలు తినకూడదు.  తినాలనిపిస్తే బాగా మగ్గిన పండును తేనెతో కలిపి తింటే ఈ ఎంజైమ్ ప్రభావం తగ్గుతుంది. 


పూర్వం నుంచి బొప్పాయి గర్భస్రావానికి కారణం అవుతుందని నమ్ముతూనే ఉన్నారు. ఇది నిజం కూడా. ప్రాచీన కాలంలో ఈజిప్టులో బొప్పాయి గింజలను ఉపయోగించి తమ దగ్గర ఉండే ఒంటెలను గర్భం ధరించకుండా చేసేవారట.  అలా బొప్పాయికి గర్భస్రావం చేసే శక్తి ఉన్నట్టు ప్రచారం మొదలైంది. ఇందులో నిజం కూడా ఉంది.  పండిన బొప్పాయిని గోటితో గీకి చూడండి, పాలు పెద్దగా రావు. కానీ పచ్చి బొప్పాయిని గోకి చూడండి, పాలు కారుతాయి. ఇలా పాలు కారే పచ్చి బొప్పాయిలో తినడం వల్ల శరీరంలో ప్రోస్టగ్లాండిన్స్ అనే హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఇవి కూడా గర్భసంచి గోడలు కుచించుకపోయేలా చేస్తాయి.  దీనివల్ల గర్భస్రావం అయ్యే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి గర్భం ధరించాలని అనుకునేవారు, గర్భిణీలు బొప్పాయికి దూరంగా ఉండటమే మంచిది.


బొప్పాయిని మితంగా తినడమే బెటర్. అధికంగా తినడం వల్ల కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గుండె జబ్బులు ఉన్నవారు ఈ పండును తక్కువగా తినమని సూచిస్తారు. దానికి కారణం ఇందులో ఉండే ఒక రకమైన అమైనో ఆమ్లం. అది గుండెకు హానికరం. అలాగే హైపోథైరాయిడిజంతో బాధపడేవారు కూడా ఈ పండును తినకూడదు. బొప్పాయి పండు అందరికీ పడకపోవచ్చు. కాబట్టి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు బొప్పాయికి దూరంగా ఉండటం మంచిది. అలాగే కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉన్నవారు కూడా బొప్పాయిని దూరం పెట్టాలి. శ్వాస సమస్యలు, జ్వరం, ఆస్తమా వంటి ఉన్న వాళ్లు బొప్పాయిని తినకపోవడమే మంచిది. 


Also read: శ్రీరామనవమికి చేసే పానకం, వడపప్పు -ఈ రెండూ కూడా వేసవి తాపాన్ని తీర్చేవే

















































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.