Kane Williamson Ruled Out:
ఊహించిందే నిజమైంది! న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) ఐపీఎల్ నుంచి నిష్క్రమించాడు. అతడు సీజన్ మొత్తానికీ దూరమయ్యాడని గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) అధికారికంగా ప్రకటించింది. అతడు త్వరగా కోలుకొని క్రికెట్లో పునరాగమనం చేయాలని ట్వీట్ చేసింది. ఒక రకంగా ఇది డిఫెండింగ్ ఛాంపియన్ జీటీకి పెద్దదెబ్బే!
'టోర్నీ ఆరంభంలోనే కేన్ విలియమ్సన్ గాయపడటం బాధాకరం. అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. అతి త్వరలోనే క్రికెట్లో పునరాగమనం చేస్తాడని ఆశిస్తున్నాం' అని గుజరాత్ టైటాన్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్, విక్రమ్ సోలంకి ఓ ప్రకటనలో తెలిపారు.
'టాటా ఐపీఎల్ 2023కు కేన్ విలియమ్సన్ దూరమవుతున్నాడని ప్రకటిస్తున్నందుకు బాధపడుతున్నాం. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచులో అతడు గాయపడ్డాడు. అతడు వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నాం' అని గుజరాత్ టైటాన్స్ ట్వీట్ చేసింది. కాగా అతడి స్థానంలో ఇంకా ఎవరినీ ప్రకటించలేదు.
దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ తిరిగొస్తే గుజరాత్ టైటాన్స్ మిడిలార్డర్ కష్టాలు తొలగిపోతాయి. రెండో మ్యాచుకు అతడు అందుబాటులో ఉంటాడని తెలిసింది. ఏప్రిల్ 3న అహ్మదాబాద్‌లో అడుగుపెడతాడని సమాచారం. ప్రస్తుతం సఫారీ జట్టు నెదర్లాండ్స్‌తో మ్యాచులు ఆడుతోంది. అందుకే అతడి రాక ఆలస్యమైంది. కేన్ లేని లోటు అతడు తీర్చగలడు.
ఏం జరిగిందంటే..
చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ లో భాగంగా మొదట సీఎస్కే బ్యాటింగ్ చేసింది. జోషువా లిటిల్ వేసిన 13వ ఓవర్లో రెండో బంతిని డీప్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అప్పటికే పరిగెత్తుకుంటూ వచ్చిన విలియమ్సన్.. గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు. అయితే బౌండరీ లైన్ అవతల ఉన్నానని గ్రహించిన అతడు.. బంతిని వలయం లోపలికి విసిరేశాడు. ఇదే క్రమంలో కింద పడుతుండగా కేన్ మామ కాలు గ్రౌండ్‌కు బలంగా తాకింది. ఉన్నఫళంగా కింద పడటంతో విలియమ్సన్ విలవిల్లాడాడు. నొప్పితో ఇబ్బందిపడుతున్న విలియమ్సన్‌కు గుజరాత్ టీమ్ ఫిజియోలు వచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. కానీ నొప్పి వేధిస్తుండటంతో ఇద్దరు మనుషుల సాయంతో అతడు పెవిలియన్‌కు చేరాడు. అతడి స్థానంలో బీ సాయి సుదర్శన్‌ను టైటాన్ సబ్‌స్టిట్యూట్‌గా తీసుకొచ్చింది. తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్‌తో స్వాప్ చేసింది.
ఇంటర్నేషనల్ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ ఎన్నాళ్లు దూరమవుతాడో తెలియడం లేదు. గాయపడటం వల్లే సుదీర్ఘ కాలం అతడు విరామం తీసుకున్నాడు. మళ్లీ ఈ మధ్యే పునరాగమనం చేశాడు. ఇంతలోనే గాయపడటం న్యూజిలాండ్ క్రికెట్‌కు పూడ్చలేని లోటే! 'ఇది విలియమ్సన్, న్యూజిలాండ్ టీమ్‌కు పెద్ద ఎదురుదెబ్బ!' అని ఆ జట్టు కోచ్ గ్యారీ స్టీడ్ సైతం అనడం గమనార్హం.
ఐపీఎల్ కోసం కొందరు ఆటగాళ్లను న్యూజిలాండ్ విడిచిపెట్టింది. అయితే మిగిలిన వారితో శ్రీలంకతో వన్డే సిరీసు ఆడిస్తోంది. ఆ తర్వాత ఐదు వన్డేలు, ఐదు టీ20ల సిరీసు కోసం పాకిస్థాన్‌కు వెళ్లాల్సి ఉంది. ప్రస్తుత గాయంతో విలియమ్సన్ ఈ రెండు సిరీసులకు దూరమవుతాడని సమాచారం.