Sai Dharam Tej: యంగ్ హీరో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తనకు గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రమాదాన్ని ఓ పీడకలగా భావించడం లేదని, దాన్ని ఒక గుణపాఠంగా, ఓ స్వీట్ మెమోరీగా అనుకుంటున్నానని తెలిపారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆనాటి జ్ఞాపకాలపై మాట్లాడిన యంగ్ హీరో... ఆ ప్రమాదం వల్ల చాలా నేర్చుకున్నానంటూ విలువైన మాటలు చెప్పారు.
2014లో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమా ద్వారా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'రేయ్', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సినిమాలతో ఆకట్టుకున్న ఆయన... 'సుప్రీం', 'విన్నర్' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ఫ్లాపులతో ఫ్యాన్స్ ను నిరాశపరిచినా.. ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండుగే’, ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాల ద్వారా మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. అంతలోనే ఆ హీరో జీవితంలో ఊహించలేని ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబరు-45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా .. బైక్ స్లిప్ అయ్యి ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో... వెంటనే మెడికవర్ ఆస్పత్రిలో చికిత్సనందించారు. ఈ ప్రమాదంలో తేజ్ కి ఛాతి, కుడి కన్నుపై, పొట్ట భాగంలో తీవ్రమైన గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ రోడ్డు ప్రమాదంపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. అధిక స్పీడ్ తో రావడం వల్లే ఇలా జరిగిందని, ఆ సమయంలో తేజ్ మద్యం మత్తులో ఉన్నాడంటూ పలువురు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు. అలా కొన్ని నెలల తర్వాత మళ్లీ షూటింగుల్లో పాల్గొనడం ప్రారంభించిన తేజ్.. ఇటీవల బైక్ సీక్వెన్స్ చేసి, మళ్లీ ఫాంలోకి వచ్చారు. అయితే అప్పటి ప్రమాదంపై సాయి ధరమ్ తేజ్ .. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో పలు వ్యాఖ్యలు చేశారు. మృత్యువు అంచు వరకు వెళ్లొచ్చిన తనకు ఆ ఘటనను తాను పీడకలగా భావించడం లేదని, అది ఓ లెసన్ గా భావిస్తున్నానన్నారు. అది తనకు ఓ స్వీట్ మెమరీ లాంటిదని వ్యాఖ్యానించారు. దాని వల్ల తాను చాలా నేర్చుకున్నానని, ముఖ్యంగా మాట విలువ తెలిసిందంటూ కామెంట్లు చేశారు. ఆ సమయంలో తనకు గొంతు కూడా సరిగా రాలేదని, అప్పుడు తనకు తన ఫ్యామిలీ, తోటి హీరోలు ఎంతో ధైర్యం చెప్పారన్నారు. ముఖ్యంగా తన తల్లి తనకు ఎంతో ధైర్యం చెప్పిందని, మళ్లీ బైక్ ఎక్కనని అనుకుంటే, భయాన్ని జయించడం అవసరమని చెప్పి, బైక్ ఎక్కించిందని గుర్తు చేసుకున్నారు. అలా అన్నీ సెట్ కావడానికి రెండు రోజులు పట్టిందన్నారు.
ఇక ఇంతకుముందే బైక్ యాక్సిడెంట్ తో ప్రాణాల మీదకు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్ ఇటీవల నటించిన ‘విరూపాక్ష’ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. ఏ మాత్రం భయపడకుండా 100 కిలోమీటర్ల స్పీడ్‌తో పొలం గట్లపై బైక్ తోలి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ సీన్స్ ను డూప్ పెట్టి మేనేజ్ చేస్తామన్నా తేజ్ వినలేదని మేకర్స్ అంటున్నారు. తనే రిస్కీ యాక్షన్ సీక్వెన్స్‌ను సింగిల్ షాట్‌లో కంప్లీట్ చేశాడని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితమే దర్శకుడు కార్తీక్ దండు, సినిమాటోగ్రాఫర్ శామ్‌దత్ సైనుద్దీన్ ‘Courage Over fear’ పేరుతో ఓ వీడియో కూడా విడుదల చేశారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ 21న విరూపాక్ష పలు భాషల్లో రిలీజ్ కానుండగా.. ఈ సినిమాలో భీమ్లా నాయక్, SIR ఫేమ్ సంయుక్త మీనన్ విరూపాక్షలో కథానాయికగా నటిస్తున్నారు.