ప్రశ్న: మాది పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లి చూపులకు, పెళ్ళికి మధ్య ఏడు నెలలు గ్యాప్ ఉంది. కానీ ఆ ఏడు నెలల్లో మేము కలిసింది చాలా తక్కువ. ఫోన్లో కూడా సాధారణంగానే మాట్లాడేవారు. అతని సంభాషణ సాధారణంగానే ఉండేది. పెళ్లయ్యాక అత్తారింట్లో అడుగు పెట్టాను. అప్పటి నుంచి నా భర్తను దగ్గర్నుంచి గమనించడం మొదలు పెట్టాను. అతని ప్రవర్తనలో ఏదో తేడా కనిపించేది. అతనికి తరచూ విపరీతమైన కోపం వచ్చేది, వెంటనే ఆ కోపం పోయి చిన్నపిల్లాడిలా మారి ప్రేమగా మాట్లాడేవాడు. నాకు ఆ ప్రవర్తన అర్థమయ్యేది కాదు. అప్పటికప్పుడే కోపం, అప్పటికప్పుడే ప్రేమ...చాలా విచిత్రంగా అనిపించేది.  ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. మా తల్లిదండ్రులు ఎంక్వైరీ చేయగా మా వివాహానికి ఐదు సంవత్సరాల ముందు అతనికి బైపోలార్ డిజార్డర్ అనే సమస్య ఉన్న విషయం బయటపడినట్టు చెప్పారు. అప్పట్లో వైద్యుల వద్దకు కూడా వెళ్లినట్టు తెలిసింది. అప్పటినుంచి నేను మోసపోయాను అనే భావన పెరిగిపోతోంది. మాకు ఇప్పుడు ఒక పాప కూడా ఉంది. ఒకరోజు విపరీతమైన కోపంతో పాపను కొట్టాడు. అప్పటినుంచి ఆమె తండ్రిని చూస్తేనే భయపడి పోతోంది. నాకు కూడా అతనితో కలిసి ఉండాలంటే భయం వేస్తోంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అతడిని విడిచి పెట్టాలా? వద్దా? అనే ఆలోచనలో ఉన్నాను. దయచేసి నాకు సలహా ఇవ్వండి. 


జవాబు: అతనికున్న వ్యాధిని దాచి మీకు పెళ్లి చేయడం మిమ్మల్ని మోసం చేయడంతోనే సమానం. మీ దురదృష్టం కొద్ది ఇలా జరిగింది. ఇప్పుడు మీరు ఒంటరి వారు కారు, మీకు ఒక బిడ్డ కూడా ఉంది. ఆమె భవిష్యత్తును మీరు దృష్టిలో ఉంచుకోవాలి. ఈ పరిస్థితి నుండి బయటపడడానికి ఎవరైనా చెప్పే సులువైన మార్గం ‘విడాకులు’.  అయితే మీరు విడాకులు తీసుకొని చిన్న బిడ్డతో జీవితాంతం ఒంటరిగా ఉండటానికి సిద్ధపడటం అనేది చాలా పెద్ద విషయం. ఆ నిర్ణయం తీసుకునే ముందు మీరు కొన్ని పనులు చేయాలి. 


బై పోలార్ డిసార్డర్ వ్యాధిని పూర్తిగా తగ్గించే చికిత్స లేకపోయినా, ఆ వ్యాధి వల్ల వచ్చే లక్షణాలను అదుపులో ఉంచే మందులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఈ విషయాన్ని మీ అత్తమామలు, మీ భర్తతో ఓపెన్ గా మాట్లాడండి. మీకు అతనికున్న వ్యాధి గురించి తెలుసన్న విషయాన్ని బయట పెట్టండి. అంతే కాదు ఆ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు మీరు కూడా సహకరిస్తారని చెప్పండి. బై పోలార్ డిసార్డర్ తో బాధపడుతున్న వ్యక్తి లక్షణాల ఆధారంగా వైద్యులు మందులను సూచిస్తారు. కాబట్టి మీ భర్తతో కలిసి మానసిక వైద్యులను కలవండి. ఇప్పుడు మూడ్ స్టెబిలైజర్లు, యాంటీ డిప్రెసెంట్లు,  కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ వంటి వాటి ద్వారా ఈ వ్యాధికి చికిత్స చేస్తారు. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా అతనిలో ఉన్న ఒత్తిడి, ప్రతికూల ఆలోచనలు తగ్గించడానికి ప్రయత్నిస్తారు. అలాగే ధ్యానం, వ్యాయామం కూడా చేయించండి.  మద్యం, మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా చూసుకోండి. ధూమపానానికి దూరంగా ఉంచండి. ఇవన్నీ చేస్తే అతనిలో ఉన్న ఉన్మాద లక్షణాలు తగ్గే అవకాశం ఉంది. అంతేకాదు సాధారణ జీవితం కూడా గడపవచ్చు. 


బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్న వారి సంఖ్య ఈ ఆధునిక కాలంలో పెరిగిపోయింది. వీరు మానసికంగా అసమతుల్యంగా ఉంటారు. అంటే సంతోషంగా ఉన్నప్పుడు మరి ఎక్కువ ఎగ్జయింట్మెంట్ ప్రదర్శించడం, బాధగా ఉన్నప్పుడు తీవ్రంగా కుంగిపోవడం వంటివి చేస్తూ ఉంటారు. తమను తాము చాలా శక్తివంతుడిగా భావిస్తారు. ఆహారం, నిద్ర లేకపోయినా యాక్టివ్‌గా కనిపిస్తారు. అదే కుంగిపోతున్న సమయంలో మాత్రం చిరాకు పడడం, నిద్రలేమి, కోపం... ఇవన్నీ కనిపిస్తాయి. 


విడాకుల వరకు వెళ్లే ముందు... మీరు ఈ పనులన్నీ చేసి అతని ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. ఇవన్నీ చేశాక అతనిలో మార్పు రావడం ఖాయం. ముఖ్యంగా బైపోలార్ డిసార్డర్ ఉన్న వ్యక్తికి మానసికంగా దగ్గరైన వ్యక్తులు అవసరం. ఎందుకంటే వారికి ఆత్మహత్య ఆలోచనలు కూడా వస్తుంటాయి. కాబట్టి ముందుగా మీ భర్తతో ఓపెన్ గా అతనికున్న వ్యాధి గురించి మాట్లాడండి. అతనిలో నమ్మకం పెంచి వైద్యుల వద్దకు తీసుకు వెళ్ళండి. 




Also read: పిల్లలతో మరీ కఠినంగా ఉంటున్నారా? అలా చేస్తే వారిలో మానసిక సమస్యలు వచ్చే అవకాశం





























































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.