Bharat Biotech Statement: కొవిషీల్డ్ వ్యాక్సిన్‌పై అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న క్రమంలోనే భారత్ బయోటెక్ (Bharat Biotech) కీలక ప్రకటన చేసింది. తమ వ్యాక్సిన్‌లకు సేఫ్‌టీ రికార్డ్ ఉందని స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనార్థం ఈ ప్రకటన చేస్తున్నట్టు వెల్లడించింది. X వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. భద్రతే ప్రధాన లక్ష్యంగా తాము వ్యాక్సిన్‌ని తయారు చేసినట్టు స్పష్టం చేసింది. భద్రతతో పాటు కొవాగ్జిన్‌ (Covaxin)ఎంతో సమర్థంగా పని చేస్తుందని వివరించింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని Covid-19 immunisation programme లో భాగంగా ట్రయల్స్‌ కూడా జరిగాయని, కొవిడ్ 19 వ్యాక్సిన్‌లలో ఈ రికార్డు కేవలం కొవాగ్జిన్‌కి మాత్రమే ఉందని స్పష్టం చేసింది. 






X వేదికగా పెట్టిన పోస్ట్‌లో ఓ నోట్‌ని విడుదల చేసింది భారత్ బయోటెక్. Covaxin - Safety First పేరుతో కొన్ని కీలక అంశాలు అందులో ప్రస్తావించింది. అవేంటంటే..


1. కొవిడ్ -19 కి సంబంధించిన ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఏకైక కరోన వ్యాక్సిన్ కొవాగ్జిన్ మాత్రమే. ఈ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ సమర్థమైందని తేలింది.


2. లైసెన్స్‌ పొందే ముందు దాదాపు 27 వేల మందిపై ప్రయోగించి, ఫలితాలు పరిశీలించింది. ఆ తరవాతే కొవాగ్జిన్ టీకా ఆమోదం పొందింది.


3. క్లినికల్ ట్రయల్స్‌ జరుగుతున్న సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. భద్రతలో ఏ మాత్రం రాజీ పడలేదు.


4. కొవాగ్జిన్ టీకా సురక్షితమైందే అని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వినియోగించవచ్చని ఆమోద ముద్ర వేసింది.


5. కొవాగ్జిన్ తయారీ మొత్తంలో సేఫ్‌టీ మానిటరింగ్ ఎక్కడా దారి తప్పలేదు. అంతా పకడ్బందీగా జరిగింది.


వీటి ఆధారంగానే కొవాగ్జిన్ టీకా సురక్షితమైందని చెబుతున్నట్టు వెల్లడించింది భారత్ బయోటెక్ సంస్థ. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎవరికీ TTS సిండ్రోమ్‌ లక్షణాలు కనిపించలేదని తెలిపింది. రక్తం గడ్డకట్టుకుపోవడం లాంటి ఇబ్బందులూ తలెత్తలేదని స్పష్టం చేసింది. కొవిడ్ వ్యాక్సిన్‌ల అవసరం ఎక్కువ కాలం లేకపోయినప్పటికీ అవి సురక్షితంగానే ఉండాలని భారత్ బయోటెక్ భావించిందని వివరించింది. తమ సంస్థ తయారు చేసిన ఏ వ్యాక్సిన్‌ అయినా ప్రజారోగ్య భద్రతే ప్రధాన లక్ష్యం అని మరోసారి తేల్చి చెప్పింది.


కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు Thrombosis Thrombocytopenia Syndrome (TTS) సిండ్రోమ్ కి గురవుతారని, ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కొన్ని రిపోర్ట్‌లు స్పష్టం చేశాయి. దీనిపై AstraZeneca కంపెనీ కూడా "నిజమే" అని సమాధానం ఇవ్వడం మరితం ఆందోళన పెంచింది. అయితే...ఈ టీకా తీసుకున్న ప్రతి ఒక్కరిలో ఈ లక్షణాలు కనిపిస్తాయనడానికి వీల్లేదని, చాలా అరుదుగా ఇలాంటివి జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. సాధారణ డ్రగ్స్‌కి ఎలాగైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో వ్యాక్సిన్లకీ ఉంటాయని వివరిస్తున్నారు. 


Also Read: PM Modi: కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్‌పై మోదీ ఫొటో మాయం, ట్రోల్స్‌పై కేంద్రం క్లారిటీ