PM Modi's Photo on Vaccine Certificate: దేశవ్యాప్తంగా కొవిషీల్డ్ వ్యాక్సిన్‌పై చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. కొవిడ్ 19 వ్యాక్సిన్ సర్టిఫికేట్స్‌పై ప్రధాని మోదీ ఫొటోని తొలగించింది కేంద్ర ప్రభుత్వం. దీనిపైనా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. ఎందుకిలా చేశారంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. సర్టిఫికేట్‌ డౌన్‌లోడ్ చేసినప్పుడు ప్రధాని మోదీ ఫొటో అందులో కనిపించడం లేదని చెబుతున్నారు. దీని వెనకాల కారణమేంటో చెప్పండని అడుగుతున్నారు. ఈ పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవడం వల్ల కేంద్రం స్పందించింది. కేంద్ర ఆరోగ్యశాఖ దీనిపై క్లారిటీ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ నిబంధనల్ని దృష్టిలో పెట్టుకుని ఫొటోని తొలగించినట్టు వెల్లడించింది. ఇప్పుడే కాదు. గతంలోనూ 2022లో ఇదే విధంగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్‌పై మోదీ ఫొటోను తొలగించారు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఫొటోను తొలగించారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఫొటోని తొలగించినట్టు కేంద్రం వివరణ ఇచ్చింది. 






కొద్ది రోజులుగా కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ గురించే చర్చ. యూకేలోని ఓ కోర్టులో కొవిషీల్డ్‌ సైడ్‌ఎఫెక్ట్స్ గురించి ఓ పిటిషన్ దాఖలైంది. ఆ విచారణ సమయంలో తమ వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్‌ వస్తాయన్న మాట నిజమే అని స్వయంగా ఆ సంస్థే అంగీకరించింది. అప్పటి నుంచి భారత్‌లోనూ అలజడి మొదలైంది. భారత్‌లో ఎక్కువ మంది తీసుకున్న వ్యాక్సిన్ ఇదే. అందుకే ఆ స్థాయిలో కలకలం రేగింది. సోషల్ మీడియాలో ఇప్పటికే బోలెడన్ని మీమ్స్ వచ్చాయి. చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు. పైగా ఈ వ్యాక్సిన్ తీసుకుంటే రక్తం గడ్డకట్టుకుపోతుందన్న ప్రచారమూ మొదలైంది. ఇది చాలా అరుదుగా జరుగుతుందని నిపుణలు చెబుతున్నప్పటికీ ఆందోళన మాత్రం తగ్గడం లేదు. సరిగ్గా ఇదే సమయంలో కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్స్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను తొలగించడం అనుమానాలకు దారి తీసింది. వ్యాక్సిన్‌పై ఆరోపణలు రావడం వల్లే కేంద్రం ఇలా చేసిందంటూ చాలా మంది మండి పడ్డారు. కానీ..అదంతా ఏమీ లేదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 






Also Read: బ్రిజ్ భూషణ్‌కి షాక్‌, ఆయనకు బదులుగా కొడుకుకి ఎంపీ టికెట్ ఇచ్చిన బీజేపీ