Karan Bhushan Singh: మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న WFI చీఫ్ బ్రిజ్ భూషణ్‌ సింగ్‌కి ఈ సారి బీజేపీ ఎంపీ టికెట్‌ని తిరస్కరించింది. యూపీలోని కైసర్‌గంజ్‌కి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిజ్ భూషణ్‌ని పక్కన పెట్టింది. ఆయనకు బదులుగా ఆయన కొడుకు కరణ్ భూషణ్ సింగ్‌కి టికెట్ కేటాయించింది. దాదాపు ఆరు సార్లు ఎంపీగా ఎన్నికైన బ్రిజ్ భూషణ్‌కి పార్టీలో మంచి క్యాడరే ఉంది. అయితే...మహిళా రెజ్లర్ల ఆరోపణలు, నిరసనలతో ఒక్కసారిగా ఆయన పొలిటికల్ గ్రాఫ్‌ పడిపోయింది. పైగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి టికెట్ ఇవ్వడం సరికాదనుకుంది బీజేపీ. అందుకే ఆయన కొడుకుకి పోటీ చేసే అవకాశమిచ్చింది. కరణ్ భూషణ్ సింగ్ ప్రస్తుతం యూపీ రెజ్లింగ్ అసోసియేషన్‌కి ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. బ్రిజ్ భూషణ్‌కి బీజేపీ టికెట్ ఇవ్వకపోవచ్చంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సస్పెన్స్‌కి తెర దించుతూ బీజేపీ అధికారికంగా ప్రకటన చేసింది. 


మే 20వ తేదీన కైసర్‌గంజ్‌లో పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు పోటీ చేసి విజయం సాధించారు బ్రిజ్ భూషణ్. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 2 లక్షల మెజార్టీతో గెలుపొందారు. కానీ ఇప్పుడు ఆయనపై ఉన్న ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని పక్కన పెట్టింది. ఇప్పటికే ఆయనతో బీజేపీ హైకమాండ్‌ ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం. బ్రిజ్ భూషణ్‌పై మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ తీవ్ర ఆరోపణలు చేశారు. తమను అసభ్యంగా తాకాడని ఆరోపించారు. ఆరుగురు రెజ్లర్లు ఇదే విధంగా ఆరోపణలు చేయడంతో పాటు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలూ చేపట్టారు. వాళ్లకి బజ్‌రంగ్ పునియా మద్దతు తెలిపాడు. కొన్ని వారాల పాటు ఈ ఆందోళనలు కొనసాగాయి. పదేళ్ల పాటు WFI చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన బ్రిజ్ భూషణ్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది.