Heeramandi Web Series Review In Telugu: సంజయ్ లీలా భన్సాలీ... ప్రేక్షకుల్లో ఆయనకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. హిస్టారికల్ సినిమాలు తీయడంలో ఆయనది సపరేట్ ట్రాక్ రికార్డ్. ఒక్కటి కాదు... 'రామ్ లీలా', 'బాజీరావ్ మస్తానీ', 'పద్మావత్', 'గంగూబాయి కతియావాడి'తో విజయాలు అందుకున్నారు. తొలిసారి ఆయన ఓ వెబ్ సిరీస్ తీశారు. 'హీరామండీ: ది డైమండ్ బజార్'తో ఓటీటీలోకి వచ్చారు. మనీషా కొయిరాలా, అదితి రావు హైదరి వంటి తెలుగు ప్రేక్షకులకు తెలిసిన హీరోయిన్లతో పాటు బాలీవుడ్ భామలు సోనాక్షీ సిన్హా, రిచా చద్దా, షర్మీన్ సెగల్ మెహతా, సంజీదా షైఖ్ కీలక పాత్రల్లో నటించారు. లాహోర్ నేపథ్యంలో స్వాతంత్ర్యానికి పూర్వం సాగే కథతో తీసిన సిరీస్ ఇది. ఎలా ఉందో రివ్యూలో చూడండి.


కథ (Heeramandi Web Series Story): హీరామండీ... అఖండ భారత దేశంలోని లాహోర్ సిటీలో వేశ్య వాటిక. నవాబులంతా అక్కడికి వచ్చి నృత్యాలు వీక్షిస్తూ సరస సల్లాప కార్యక్రమాల్లో సేద తీరుతారు.


హీరా మండీలో షాహి మహల్ మహారాణి మల్లికా జాన్ (మనీషా కొయిరాలా). అక్కడ ఆమె చెప్పింది వేదవాక్కు. పెద్ద కుమార్తె బిబ్బో (అదితి రావు హైదరి)కి కన్నెరికం చేయించి, వేశ్య వృత్తిలోకి దింపింది. చిన్న కుమార్తె ఆలంజెబ్ (షర్మీన్ సెగల్ మెహతా)ను సైతం ఈ వృత్తిలోకి తీసుకు రావాలని ప్రయత్నిస్తుంది. అయితే... ఆమె కవయిత్రి కావాలని అనుకుంటుంది. తనకు కన్నెరికం ఇష్టం లేదని చెబుతుంది. బ్రిటిష్ అధికారి కార్ట్ రైట్ (జాన్సన్ షా) ఇంటిలో నృత్యం చేసేది లేదని, ఎవరైనా తమ హీరామండీకి రావాలని చెప్పడంతో పగ మల్లికపై తీర్చుకోవడానికి అతడు ఎదురు చూస్తున్నాడు. ఈ తరుణంలో మల్లిక చేతిలో మరణించిన ఆమె అక్క రెహానా (సోనాక్షీ సిన్హా) కుమార్తె ఫరీదన్ (సోనాక్షీ సిన్హా) హీరామండీకి వస్తుంది. 


మల్లిక సొంత చెల్లెలు వహీదా (సంజీదా షైఖ్)తో కలిసి మల్లికకు వ్యతిరేకంగా ఫరిదీన్ ఏం చేసింది? కన్నెరికానికి ముందు హీరామండీ నుంచి పారిపోయిన ఆలంజెబ్ ఎక్కడికి వెళ్లింది? ఆమెకు బ్రిటిష్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? కుమార్తెను విడిపించుకోవడానికి మల్లికాజాన్ ఏం చేసింది? తర్వాత ఏమైంది? తాజ్ దార్ (తహ షా బాదుషా) ఎవరు? స్వాతంత్ర్య పోరాటంలో హీరామండీ వేశ్యల పాత్ర ఏమిటి? అనేది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Heeramandi Review In Telugu): హీరామండీలో మహిళలు లాహోర్ నగరానికి మహారాణులు అనే విధంగా మనీషా కొయిరాలా సిరీస్ ప్రారంభంలో ఓ మాట చెబుతారు. నిజంగా ఆమెను మహారాణిలా చూపించారు సంజయ్ లీలా భన్సాలీ. ఒక్క మనీషా కొయిరాలాను మాత్రమే కాదు... అదితి రావు హైదరి, సోనాక్షి సిన్హా, రిచా చద్దా - ప్రతి ఒక్కరినీ అందంగా చూపించారు. మగాళ్లకు మహిళలు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రజెంట్ చేశారు.


సాధారణంగా వేశ్య అంటే ప్రేక్షకులలో ఒక విధమైన భావన ఉంటుంది. ఇప్పటి వరకు తెరపై వాళ్లను చూపించిన తీరూ అందుకు ఓ కారణం కావచ్చు. అయితే... 'హీరామండీ' ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ సీన్ తర్వాత సిరీస్ చూసే ప్రేక్షకుల్లో ఆ ఊహ పక్కకి వెళుతుంది. తెర నిండుగా ప్రతి ఫ్రేములో సంజయ్ లీలా భన్సాలీ ప్రతిభ స్క్రీన్ ముందున్న ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్‌లోనే హీరామండీ లోకంలోకి ప్రేక్షకులను తీసుకు వెళ్లారు. ఆ పాత్రలతో ప్రయాణం చేసేలా చేశారు. 'రామ్ లీలా', 'పద్మావత్' తరహాలో ప్రతి సన్నివేశంలో ఆర్ట్ వర్క్, మ్యూజిక్ సర్‌ప్రైజ్ చేస్తుంది.


వేశ్య గృహంలో మొదలైన కథను నిదానంగా స్వాతంత్య్రం వైపు మళ్లించడంలో సంజయ్ లీలా భన్సాలీ ప్రతిభ కనబడుతుంది. ప్రతి మహిళలోనూ పరిస్థితులకు తగ్గట్టు ఓ పోరాటం చేసే గుణాన్ని చూపించారు. అయితే... ఎక్కువ నిడివి, ప్రతి అంశంలో డిటైలింగ్‌కు వెళ్లడం మైనస్ పాయింట్సే. లజ్జో పాత్రలో రిచా చద్దా నటన బావుంది. అయితే... వేశ్యలను నవాబులు వాడుకుని వదిలేస్తారని, పెళ్లి చేసుకోరని చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకున్నారు. మల్లికగా మనీషా కొయిరాలా పాత్రను ఎస్టాబ్లిష్ చేశాక... వేశ్యల మధ్య ఆధిపత్య పోరు, ఆ తర్వాత వేశ్యలను అసహించుకునే యువకుడు వేశ్య కుమార్తెతో ప్రేమలో పడటం వంటి కథలతో సిరీస్ నడిపారు. చివరగా స్వాతంత్ర్య పోరాటంలో మహిళల త్యాగాలకు చోటు దక్కలేదని ముగించారు. ఒక దశలో అసలు కథ నుంచి పక్కకు వెళ్లినట్లు అనిపిస్తుంది. థ్రిల్ కంటే డ్రామా ఎక్కువ.


Also Read: రత్నం మూవీ రివ్యూ: విశాల్ హీరోగా సింగమ్ సిరీస్ హరి తీసిన సినిమా ఎలా ఉందంటే?



మల్లికాజాన్ పాత్రలో మనీషా కొయిరాలా అద్భుతంగా నటించారు. కన్నకుమార్తె అనే మమకారం లేకుండా కళ్లలో కఠినత్వం చూపే సన్నివేశాల్లో నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. పిన్ని మీద ప్రతీకారంతో రగిలే మహిళగా సోనాక్షీ సిన్హా సైతం అద్భుతంగా నటించారు. అదితి రావు హైదరి అందం గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె పాత్రను తీర్చిదిద్దిన తీరు, ఆమె నటన బావుంది. షర్మీన్ మెహతా యువరాణిలా ఉంది. సంజీదా షైఖ్ నటన కూడా బావుంది. నటీనటులు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే... భన్సాలీ మహిళల సైడ్ తీసుకున్నట్లు కనబడుతుంది. మేల్ ఆర్టిస్టులు ఎవరికీ సరైన సన్నివేశాలు గానీ ప్రాధాన్యం గానీ దక్కలేదు. ఒక్క తాహా షా బాదుషాకు తప్ప! 


'రెండు కత్తులు తలపెడితే అది ప్రయోజనం లేని పోరాటం. అసలైన మజా మనకు కలిగేది ఇద్దరు వేశ్యలు తలపడినప్పుడే', 'భార్యకు అండగా నిలబడని మగాడు వేశ్యకు నిలబడతాడా?', 'ఏనాడూ ఒక్క వేశ్య కూడా భార్య మీద జాలి చూపలేదుగా. మరి, ఈనాడు భార్య ఎందుకు వేశ్య మీద జాలి చూపించాలి' వంటి సంభాషణలు ప్రేక్షకుల్లో ఆలోచనతో పాటు ఆసక్తి కలిగిస్తాయి.


హీరామండీ... సంజయ్ లీలా భన్సాలీ మార్క్ ఆర్ట్ వర్క్, మ్యూజిక్, పొయెటిక్ స్టైల్ ప్రతి ఫ్రేములో కనిపించే సిరీస్. ఆయన స్టైల్ డైరెక్షన్, సీన్లు నచ్చే ప్రేక్షకులకు ఈ సిరీస్, సన్నివేశాలు నచ్చుతాయి. అయితే... ఆల్మోస్ట్ ఏడెనిమిది గంటలు లెంగ్త్ ఉండటంతో ఓపిగ్గా చూడాల్సి వస్తుంది. ఒక్కసారి క్యారెక్టర్లకు కనెక్ట్ అయితే అలా అలా చూస్తూ వెళతారు. ఫైనల్లీ... భన్సాలీ కోసం 'హీరామండీ' చూద్దాం!


Also Readమై డియర్ దొంగ రివ్యూ: Aha OTTలో అభినవ్ గోమఠం కొత్త సినిమా ఎలా ఉందంటే?