''అల్లు అరవింద్ గారికి మా 'మై డియర్ దొంగ' సినిమా నచ్చడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇంత మంచి సినిమాలో నేను కూడా ఓ భాగం కావడం ఇంకా సంతోషం అనిపించింది. ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు'' అని అభినవ్ గోమఠం (Abhinav Gomatam) అన్నారు... ఇప్పుడు వరుస విజయాల్లో ఉన్న తెలుగు నటుడు ఆయన. ప్రేక్షకులకు ఫుల్లుగా వినోదం పంచుతూ... బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ఫుల్ ఫిలిమ్స్ చేస్తున్నారు. ఆయన హీరోగా నటించిన 'మై డియర్ దొంగ' ఆహా ఓటీటీలో విడుదలై విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. 


'మై డియర్ దొంగ'తో రచయితగా మారిన హీరోయిన్
'మై డియర్ దొంగ'లో అభినవ్ గోమఠం టైటిల్ రోల్ చేయగా... శాలినీ కొండెపూడి కథానాయికగా నటించారు. విశేషం ఏమిటంటే... ఈ సినిమాకు ఆవిడ రైటర్ కూడా! ఒక్క సినిమాతో నాయికగా, రచయితగా విజయం అందుకున్నారు. దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి బీఎస్ సర్వాంగ కుమార్ దర్శకుడు. క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై గోజల మహేశ్వర్‌రెడ్డి ప్రొడ్యూస్ చేశారు. విమర్శకులకు, ప్రేక్షకులకు సినిమా నచ్చిన నేపథ్యంలో తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు.


'మై డియర్ దొంగ' సక్సెస్ మీట్ (My Dear Donga Movie Success Meet)లో హీరో అభినవ్ గోమఠం మాట్లాడుతూ... ''సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. మా ప్రొడక్షన్ హౌస్, ఆరిస్టులు, ఆహా ఓటీటీ... మూడు టీమ్స్ చక్కటి సమన్వయంతో సినిమా చేశాయి. రచయితగా శాలినీకి తొలి సినిమా ఇది. చక్కగా రాసింది. ఎంతో కష్టపడింది. ఆమెకు కంగ్రాట్స్. మీ టీమ్ అందరికీ కూడా'' అన్నారు. ప్రొడ్యూసర్ మహేశ్వర్‌‌ రెడ్డి మాట్లాడుతూ... ''ఈ సినిమాపై ముందు నుంచి నమ్మకంగా ఉన్నాం. ఈ రోజు మా నమ్మకం నిజం అయ్యింది. సినిమా చూసిన వారంతా చాలా ఎంజాయ్ చేశామని చెబుతున్నారు. హీరో అభినవ్ నటన ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది ఫోన్స్ చేసి మెచ్చుకున్నారు. ఇంకా సినిమా చూడని ప్రేక్షకులు ఎవరైనా ఉంటే వెంటనే చూడండి'' అని రిక్వెస్ట్ చేశారు.


ఆహాలో ఇప్పటి వరకు 25 లక్షల మంది చూశారు!
'మై డియర్ దొంగ' చిత్రాన్ని ఇప్పటి వరకు 25 లక్షల మంది చూశారని 'ఆహా' ఓటీటీ మార్కెటింగ్ హెడ్ రాజశేఖర్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఈ సినిమాకు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వస్తోంది. చిన్న సినిమా అయినా పెద్ద విజయం సాధించింది. 'మై డియర్ దొంగ రిటర్న్స్' కోసం వెయిట్ చేస్తున్నాను'' అని అన్నారు. ''అభినవ్ గోమఠం సపోర్ట్, ప్రొడక్షన్ డిజైనర్ ఝాన్సీ సహకారం, అజయ్ అరసాడ సంగీతంతో సినిమా బాగా నచ్చింది. శాలినీ కొండెపూడి మంచి రచయిత, నటి.  ఆమె ఎంతో కష్టపడింది. ఈ టీంతో మళ్ళీ ఇంకో ప్రాజెక్టు చేయాలని ఉంది'' అని దర్శకుడు బీఎస్ సర్వాంగ కుమార్ చెప్పారు.


Also Read: హీరామండీ రివ్యూ: స్వాతంత్ర్య సమరంలో వేశ్యల కథ - Netflix OTTలో భన్సాలీ తీసిన సిరీస్, ఎలా ఉందంటే?



''మై డియర్ దొంగ'కు వచ్చిన రివ్యూలు, రెస్పాన్స్ ఎంతో సంతోషాన్నిచ్చింది. మా టీం అందరి సమష్టి కృషితో చేసిన అందమైన చిత్రమిది. కంటెంట్ మీద నమ్మకంతో సినిమా చేస్తే విజయం వస్తుందని చెప్పడానికి ఇదొక ఉదహరణ. మాకు ఈ విజయం ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్. ఈ విజయం నాలో ఆత్మ విశ్వాసాన్ని నింపింది. నా కథను అర్థం చేసుకుని దర్శకుడు చక్కగా తెరకెక్కించారు'' అని హీరోయిన్ కమ్ రైటర్ శాలినీ కొండెపూడి చెప్పారు.


Also Read: బాబీ డియోల్... బాలీవుడ్‌లో పవన్ సినిమాకు ప్లస్సే - 'యానిమల్'కు మించి ఉంటుందా?