రాత్రంతా అస్సలు నిద్రపట్టలేదు.. అనేది ఈరోజుల్లో చాలా మంది నోటి నుంచి వినిపించే మాట ఇది. రాత్రిపూట తగినంత నిద్రలేకపోతే తెల్లారి అలసటగా అనిపిస్తుంది. ఏ పని మీద శ్రద్ద ఉండదు. ఇది నిద్రలేమికి సంకేతం కావచ్చు. దీని నుంచి బయట పడేందుకు నిద్ర మాత్రల మీద ఆధారపడతారు. కానీ ఇది ఆరోగ్యానికి అంతగా ప్రయోజనాలు అందించకపోగా సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తుంది. అందుకే ఆయుర్వేద ప్రకారం కొన్ని పానీయాలు తీసుకుంటే హాయిగా నిద్రపోవచ్చు. అవేంటంటే..


అశ్వగంధ టీ


ఆయుర్వేదంలో అశ్వగంధకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో అశ్వగంధ మేలైన ప్రయోజనాలు అందిస్తుంది. ఇదొక అడాప్టోజెనిక్ హెర్బ్. నాడీ వ్యవస్థని శాంతపరుస్తుంది. విశ్రాంతిని ప్రోత్సాహిస్తుంది. అశ్వగంధ రూట్ లేదా పొడిని వేడి నీటిలో లేదా పాలలో వేసుకుని బాగా మరిగించుకుని టీ తయారు చేసుకోవచ్చు. అది కొద్దిగా చల్లారిన తర్వాత తేనె కలిపి తీసుకోవచ్చు.


వెచ్చని నీరు, నెయ్యి


నెయ్యి అనేక పోషక గుణాలు కలిగి ఉంది. ఒక టీ స్పూన్ నెయ్యిని గోరు వెచ్చని నీటిలో కలుపుకుని నిద్రవేళకు ముందు తాగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి నిద్రని ప్రేరేపిస్తుంది.


కుంకుమ పువ్వు, యాలకుల పాలు


కుంకుమ పువ్వు, యాలకులు విశ్రాంతిని ప్రోత్సహించడానికి ఆయుర్వేదంలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు. గోరు వెచ్చని పలు/ నీటిలో కొన్ని కుంకుమ పువ్వు, చిటికెడు యాలకుల పొడిని కలుపుని తాగొచ్చు. ఇది విశ్రాంతిని ఇస్తుంది.


పసుపు పాలు


జలుబు, ఫ్లూ వచ్చినప్పుడు అందరూ ఆధారపడే పానీయం పసుపు పాలు. దీన్నే గోల్డెన్ మిల్క్ అని అంటారు. నిద్రనీ ప్రేరేపించడంలో సహాయపడే శక్తివంతమైన పానీయం. ఇందులోని కర్కుమిన్, యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా హాయిగా నిద్ర పట్టేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.


సుగంధ ద్రవ్యాలు, వెచ్చని పాలు


వెచ్చని పాలు నిద్రలేమికి ఒక క్లాసిక్ ఆయుర్వేద నివారణ. చిటికెడు పసుపు, చిటికెడు జాజికాయ పొడి కలిపి పాలలో కలుపుకుని తీసుకుంటే నిద్రను ప్రేరేపిస్తుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. జాజికాయ ప్రశాంతతని ప్రోత్సహిస్తుంది. నిద్ర, విశ్రాంతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.


వలెరియన్ రూట్ టీ


వలెరియన్ రూట్ శతాబ్దాలుగా నిద్రలేమి, ఆందోళన తగ్గించేందుకు సహజ నివారణగా ఉపయోగించబడుతుంది. ఇది నిద్ర నాణ్యతని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నిద్రపోయే ముందు దీనితో చేసిన టీ తాగడం వల్ల మెదడు నరాలకి, నాడీ వ్యవస్థని శాంతపరుస్తుంది.


దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల నాడీ సంబంధ సమస్యలు వస్తాయి. తగినంత నిద్రలేకపోవడం లేదా అధిక నిద్ర అభిజ్ఞా సామర్థ్యాలకి హాని చేస్తుంది. స్థిరంగా ఒక వ్యక్తి ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయినప్పుడు దృష్టి, ఏకాగ్రత సామర్థ్యం తగ్గిపోతుంది. నిద్ర లేకపోవడం మానసిక స్థితి, భావోద్వేగ నియంత్రణను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అభిజ్ఞా పనితీరుని అడ్డుకుంటుంది. అందుకే కనీసం ఎనిమిది గంటలు నిద్ర శరీరానికి చాలా అవసరం.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: మానసిక ఆరోగ్యాన్ని కాపాడే జపాన్ టెక్నిక్ 'జాజెన్'