వయసు పెరుగుతూ ఉంటే కీళ్ల నొప్పులు, వాపు అధికమవుతాయి. అలాగే అధిక బరువుతో బాధపడే వారికి కూడా చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయి. వాతావరణంలో మార్పులు కూడా ఈ నొప్పిని పెంచుతాయి. పూర్వం వృద్ధులు, మహిళలే ఎక్కువగా ఈ సమస్యతో బాధపడేవారు. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరికీ కీళ్ల నొప్పులు వచ్చేస్తోంది.వీటికి ఇంగ్లీష్ మందులు వాడడం ఇష్టం లేని వారికి, ఆయుర్వేదం సులభమైన చికిత్స పద్ధతులను చూపిస్తోంది. ఇది చాలా సహజమైన చికిత్సలుగా చెప్పుకోవాలి. ఈ మందులు వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కూడా ఉండవు.
కీళ్లకు నొప్పులు ఎందుకు?
ఒకప్పుడు వయసు మీరిన వాళ్ళలో మాత్రమే కీళ్ల నొప్పులు కనిపించేవి. కానీ ఇప్పుడు తక్కువ వయసు ఉన్న వారిలో కూడా తరచూ కీళ్ల సమస్యలు బయట పడుతున్నాయి. దానికి కారణం... వ్యాయామం తగ్గడమే. ఉద్యోగాలు చేస్తూ కదలకుండా ఒకే చోట కూర్చునే వారిలో కీళ్ల సమస్యలు వస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే ఏదైనా గాయం తగలడం, పోషకాహార లోపం వల్లా కీళ్ల నొప్పులు వస్తాయి. దీన్ని ఆర్థరైటిస్ అని కూడా అంటారు. వయసు పైబడిన వాళ్లలో కీళ్లు అరిగిపోవడం వల్ల నొప్పులు వస్తాయి. అలాగే కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. రోగనిరోధక శక్తి తగ్గినా ఈ సమస్య బయటపడుతుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలలోనే ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది.
ఆయుర్వేదంలో...
కీళ్లు వాపు, కీళ్ల నొప్పి వేధిస్తుంటే ఆయుర్వేద చికిత్సలు చేయించుకోవచ్చు. ఇందులో భాగంగా ఉలవలను పొడిచేసి, నువ్వుల నూనెతో కలిపి ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దను కీళ్లపై పెట్టి, పలుచని వస్త్రంతో కట్టుకోవాలి. రాత్రంతా ఇలా ఉంచడం వల్ల వాపు, నొప్పి తగ్గుతాయి. ఉలవలు 100 గ్రాములు తీసుకుంటే, నువ్వుల నూనె 50 గ్రాములు తీసుకోవాలి.
ఆముదం చెట్టు బెరడు కూడా కీళ్ల నొప్పులు తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఆముదం చెట్టు బెరడు, రేల చెట్టు వేర్లు ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని గ్లాస్ నీటిలో అర స్పూన్ వేసుకొని రాత్రంతా నానబెట్టాలి. ఉదయం లేచాక ఆ నీటిని మరగకాచాలి. ఆ నీరు సగం అయ్యే వరకు మరగకాచాలి. తరువాత ఆ నీటిని చల్లార్చి తాగేయాలి. ఇలా 20 రోజులు చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి
ఆయుర్వేదంలో అందుక బంక చెట్టుకు మంచి విలువ ఉంది. ఈ చెట్టు నుంచి సేకరించిన బంకను, నీళ్లలో కలిపి మరిగించి చల్లార్చి తాగేయాలి. ఇలా తాగితే వారం రోజులకే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇక్కడ చెప్పిన ఏ చికిత్స వల్ల కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లు ఉండవు. కాకపోతే రుచి మాత్రమే కాస్త ఇబ్బంది పెట్టి ఉండొచ్చు.
Also read: మొటిమల కారణంగా చెంపలపై పడిన గుంతలు పోతాయా? ఎలాంటి చికిత్సలు ఉన్నాయి?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.