"సర్వేంద్రియానం నయనం ప్రధానం" అంటారు పెద్దలు. అన్ని ఇంద్రియాల్లో కళ్ళు చాలా ముఖ్యమైనవి. కానీ వాటినే అందరూ నిర్లక్ష్యం చేస్తారు. స్క్రీన్ సమయం పెరగడం, సరైన నిద్ర లేకపోవడం వల్ల కళ్ళకి అపారమైన నష్టం కలుగుతుంది. టీవీ, ల్యాప్ టాప్, మొబైల్ వంటి డిజిటల్ స్క్రీన్‌లకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అధిక సమయం స్క్రీన్ చూడటం వల్ల కళ్ళు పొడి బారిపోవడం, ఒత్తిడి, తలనొప్పి, కళ్ళు మసకబారిపోవడం వంటివి ఎదుర్కుంటారు. ఇవే కాదు మెడ, భుజం నొప్పులు కూడా వస్తాయి. కొన్ని సార్లు వీటి వల్ల నిద్ర విధానం కూడా దెబ్బతింటుంది. ఏకాగ్రత మందగిస్తుంది. కళ్ళని రుద్దడం లేదా ఐ డ్రాప్స్ వంటి సాధారణ అలవాట్లు చెడు చేస్తాయి.


ఆయుర్వేద నిపుణురాలు రేఖా రాధామోనీ కళ్ళ విషయంలో ఈ తప్పులు చేయవద్దని అంటున్నారు. ఆరోగ్యవంతమైన కళ్ళని కాపాడుకోవడానికి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ తప్పులు చేశారంటే కళ్ళు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు.


కళ్ళని గోరువెచ్చని నీళ్ళతో కడగటం: మనలో చాలా మంది గోరువెచ్చని నీటితో కళ్ళని కడుగుతుంటారు. కానీ ఇది అసలు మంచిది కాదు. కళ్ళు పిత్త దోషాన్ని పెంచుతాయి. అందుకే వాటిని గది ఉష్ణోగ్రత నీరు లేదా చల్లటి నీటితో కడగాలి.


కళ్ళు రెప్పవేయకుండా ఉండకూడదు: రెప్పవేయడం అనేది కంటి ఒత్తిడిని నివారించడానికి ప్రభావవంతంగా ఉన్న మార్గాల్లో ఒకటి. కళ్ళకి విశ్రాంతిని అందించడమే కాకుండా కళ్ళని లూబ్రికేట్ చేయడం ద్వారా పొడిబారకుండా చేస్తుంది. టాక్సిన్స్ శుభ్రపరుస్తుంది. మొబైల్ ఎక్కువగా చూస్తూ రెప్పవేయడం మర్చిపోతారు. కానీ తరచుగా రెప్ప వేయడం చాలా అవసరం.


ఐ డ్రాప్స్ వద్దు: కళ్ళు మంటగా అనిపించినా నొప్పులుగా ఉన్నా కొంతమంది తక్షణ ఉపశమనం కోసం ఐ డ్రాప్స్ ఉపయోగిస్తారు. అవి స్వల్పకాలంలో ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో కళ్ళని మరింత పొడిగా మార్చేస్తాయి. దీర్ఘకాలం పాటు వేసుకునే కంటి మందులు ఎప్పుడు నూనె ఆధారితంగా ఉంటాయి. ఇవి కళ్ళకి మేలు చేస్తాయి.


నిద్రపోవడానికి ముందు కంటి మాస్క్ లు పెట్టుకోవడం: చాలా మంది చర్మ సంరక్షణలో భాగంగా కంటికి కూడా మాస్క్ లు పెట్టేసుకుని నిద్రపోతారు. హాట్ కంప్రెస్ ఐ మాస్క్ లు సౌకర్యంగా అనిపించినప్పటికి కళ్ళకి అది మంచిది కాదు. రాత్రిపూట కళ్ళు స్వేచ్చగా ఊపిరి పీల్చుకునేలా ఉంచుకోవాలి. ఇన్ఫెక్షన్లని నివారించేందుకు వేడిగా ఉండే ప్యాక్ కి బదులుగా కోల్డ్ ప్యాక్ వేసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణురాలు సూచిస్తున్నారు.


కళ్ళు పదే పదే రుద్దడం: చాలా మందికి ఉన్న అలవాటు. తరచూ కళ్ళు రుద్దడం కంటికి మంచిది కాదు. కళ్ళలోని సన్నని పొర వాటిని రక్షిస్తుంది. రుద్దటం వల్ల అది దెబ్బతింటుంది. రుద్దడానికి బదులుగా చల్లని నీటితో కళ్ళు కడగటం మంచిది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: క్యాబేజీ తింటే బరువు తగ్గుతారా? ఆయుర్వేదం ఏం చెబుతోంది? ఏ వేళలో తింటే మంచిది?