క్యాబేజీ అంటే చాలా మందికి నచ్చదు. కారణం దాని నుంచి వచ్చే పచ్చి వాసన. కానీ ఇది తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, కాంపౌండ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కారకాలని నిరోధించి శుభ్రపరుస్తాయి. బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. జీర్ణవ్యవస్థకి సరిగా ఉండేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీరం కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది.


బరువు తగ్గడంలో క్యాబేజీ ఎలా పని చేస్తుంది?


ఇందులో ఫైబర్, వాటర్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. పొట్ట(గట్)ను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీవక్రియని మెరుగుపరిచి టాక్సిన్స్ ని బయటకి పంపేందుకు సహకరిస్తుంది. దీన్ని పులియబెట్టి తీసుకుంటే ప్రోబయోటిక్స్ ని పెంచుతుంది. ఇది గట్ ఆరోగ్యానికి మంచిది. ఒక కప్పు క్యాబేజీ తీసుకుంటే 33 కేలరీలు అందుతాయి. కొవ్వు అసలు ఉండదు. ఫైబర్ ఎక్కువగా ఉండటం పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉన్న అనుభూతి కలిగిస్తుంది. కొవ్వును రక్తంలో శోషించకుండా బయటకి తీస్తుంది. క్యాబేజీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్-C పుష్కలంగా ఉంటుంది. క్యాన్సర్ కణాల పురోగతిని నిరోధిస్తుంది.


ఎర్ర క్యాబేజీలోని యాంటీ ఆక్సిడెంట్లు ఆంథోసైనిన్లు ఏర్పడటాన్ని నెమ్మదిస్తాయి. ఇప్పటికే శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలని కూడా చంపుతుంది. క్యాబేజీలో ఉండే గ్లుటామైన్ అనే అమైనో యాసిడ్ బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏంజెట్ గా పనిచేస్తుంది. విటమిన్ కె ఉండటం వల్ల మెదడు ఆరోగ్యానికి మంచిది. క్యాబేజీలో దాదాపు 20 రకాల ఫ్లేవనాయిడ్లు, 15 ఫినాల్స్ ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఇది కార్డియో వాస్కులర్ ప్రమాదాలని తగ్గిస్తుంది. కాల్షియం, పొటాషియం రక్తపోటుని నియంత్రించడంలో సహాయపడతాయి.


ఈ ముప్పు కూడా ఉంటుంది జాగ్రత్త


క్యాబేజీ చల్లని వాతావరణంలో పెరుగుతుంది. సహజంగా పోషకాలని కోరుకునే మొక్క. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఇతర పరాన్నజీవులు ద్వారా సంక్రమణకి గురవుతుంది. అందుకే దీన్ని తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం క్యాబేజీ తీసుకోవడం వాత, పిత్త, కఫాల్లో మార్పులు తీసుకొస్తుంది. క్యాబేజీ చల్లని వాతావరణంలో పెరగడం వల్ల వాతాన్ని పెంచుతుంది. వాత తీవ్రతని తగ్గించడానికి ఆకుకూరలు మెత్తగా కోసి అందులో వేసుకుని తినొచ్చు. సుగంధ ద్రవ్యాలు, నూనెతో బాగా ఉడికించుకుని తీసుకోవచ్చు. శీతాకాలం, వసంతకాలంలో ఇది పిత్త, కఫ దోషాలని పెంచుతుంది. వాత సమస్య ఉన్న వాళ్ళు దీన్ని తింటే జీర్ణం కావడం కష్టం. వెనిగర్ తో పులియబెట్టి తీసుకుంటే మంచిది. థైరాయిడ్ హార్మోన్లు పనితీరుకి అంతరాయం కలిగిస్తుంది. హైపోథైరాయిడిజం ఉన్న వారు అసలు తినకపోవడమే మంచిది.


ఆరోగ్య ప్రయోజనాలు పొందటం కోసం క్యాబేజీ తక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు తినడం వల్ల పొట్ట ఉబ్బరం, పొత్తి కడుపు అసౌకర్యంగా ఉంటుంది. మితంగా తీసుకోవడం వల్ల వాతం పెరగకుండా ఉంటుంది. పిత్త సీజన్(సెప్టెంబర్-అక్టోబర్), కఫ సీజన్(మార్చి-ఏపిల్). ఈ సమయంలో పచ్చి క్యాబేజీ తీసుకోకుండా వండిన దాన్ని మాత్రమే తినాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: మందు తాగిన తర్వాత హ్యాంగోవర్ తగ్గాలంటే నానబెట్టిన వీటిని తినేయండి