Andhra Politics : ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వివాదం క్రమంగా మూడు రాష్ట్రాల ఉద్యమంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రాంతాల పేర్లతో రాజకీయ పార్టీలు కూడా పెడుతున్నారు. ఇటీవల వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలోని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడారు. ఆయన అలా మాట్లాడి వారం కాక ముందే అప్పుడే జై ఉత్తరాంధ్ర పేరుతో ఓ పార్టీ ని పెట్టేందుకు కొంత మంది సన్నాహాలు చేస్తున్నారు. సమావేశాలు ప్రారంభించారు. ఇప్పటికే రాయలసీమలోనూ ప్రత్యేక వాదం వినిపిస్తోంది. గతంలోనే అక్కడ ప్రత్యేక రాష్ట్రం కోసం పార్టీలు ప్రారంభమయ్యాయి. ఏపీ చివరికి మూడు రాష్ట్రాలుగా విడిపోయే పరిస్థితి వస్తుందా అనేలా ప్రస్తుత పరిణామాలు ఏర్పడుతున్నాయన్న వాదన వినిపిస్తోంది.
జై ఉత్తరాంధ్ర పేరుతో కొత్త పార్టీ
జనసేన తరపున గతఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన మెట్ట రామారావు అనే నేత తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు. కానీ హఠాత్తుగా ఆయన జై ఉత్తరాంధ్ర అనే పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన లాంటి పార్టీ తరపున పోటీ చేసినప్పటికి ఆయనకు పార్లమెంట్ నియోజకవర్గం మీద మొత్తం ముఫ్పై వేల ఓట్లకు కాస్త ఎక్కువగానే వచ్చాయి. అయినప్పటికీ ఆయన ఇటీవల ఉత్తరాంధ్రలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయన జై ఉత్తరాంద్ర పేరుతో పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ పార్టీ ఉద్దేశం ప్రత్యేక రాష్ట్ర సాధన అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విశాఖను రాజధానిగా చేయడం లేకపోతే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేయండి అన్న ధర్మాన వ్యాఖ్యల తర్వాతే రామారావు ప్రత్యేక పార్టీ గురించి.. తన కసరత్తు గురించి మీడియాకు తెలిసేలా చేయడం ఆసక్తి రేపుతోంది.
రాయలసీమలో క్రమంగా పెరుగుతున్న ప్రత్యేక రాష్ట్ర డిమాండ్
నిజానికి రాయలసీమలోనూ ప్రత్యేక రాష్ట్ర వాదం ఉంది. అసలు రాజధాని మార్చాల్సి వస్తే అది కర్నూలులోనే ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు ఎదుకంటే విశాల ఆంధ్ర భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోయిన సమయంలో మొదట కర్నూలే రాజధానిగా ఉండేది. తర్వాత హైదరాబాద్ కు మార్చారు. అందుకే కర్నూలు రాజధాని అనేది తమ హక్కు అని రాయలసీమ వాసులు భావిస్తారు. అదొక్కటే కాదు.. వివిధ కారణాలతో రాయలసీమలో ప్రత్యేక రాష్ట్ర వాదం ఉంది. గతంలో రాయలసీమ సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక రాయలసీమ సాధన కోసం ప్రత్యేక పార్టీ పెట్టారు. కానీ ప్రజల నుంచి అనుకున్నంత స్పందన రాకపోవడంతో ఆయన పార్టీని రద్దు చేసుకున్నారు. కానీ ఇటీవలి కాలంలో .. ముఖ్యంగా మూడు రాజధానుల వివాదం తెరపైకి వచ్చిన తర్వాత రాయలసీమ రాష్ట్రం గురించి అక్కడా చర్చ జరుగుతోంది.
అమరావతి అభివృద్ధి కాక ముందే రాష్ట్ర విభజన వాదాలు !
ఏకైక రాజధానిని అభివృద్ధి చేస్తే మళ్లీ హైదరాబాద్ లా అవుతుందని... మళ్లీ విభజన వాదం వస్తుందని వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ పెద్దలు చెబుతూంటారు. అయితే ఇప్పుడు అమరావతి అభివృద్ధి కాకుండానే విభజన వాదం వచ్చేసింది. అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర నుంచి తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్లు ప్రారంభమయ్యాయి. అయితే వీటికి ఎంత ప్రజా మద్దతు ఉందనేది చెప్పడం కష్టం. ఇలాంటి డిమాండ్లు చేస్తున్న వారు ఎంత ఎక్కువగా ప్రజల మద్దతు కూడగట్టగలిగితే వారి డిమాండ్ కు అంత బలం లభిస్తుంది. లేకపోతే.. ఈ డిమాండ్లు ఎన్నికల వరకూ వినిపిస్తారు. తర్వాత మళ్లీ సైలెంటయ్యే అవకాశాలు ఎక్కువ.