Rahul Gandhi Kamal Hasan Chitchat:


రాహుల్ కమల్ చిట్‌చాట్ 


కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, లోకనాయకుడు కమల్‌హాసన్‌తో ముచ్చటించారు. వారం క్రితమే వీరిద్దరూ కలిసి ఢిల్లీలో భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి దేశ రాజకీయాలపై చర్చించారు. ఈ వీడియోని రాహుల్ గాంధీ తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. సోషల్ మీడియాలోని అన్ని అకౌంట్లలోనూ ప్రోమో పోస్ట్ చేశారు. చైనాతో సరిహద్దు వివాదం, వ్యవసాయంలో సమస్యలు ఇలా...ఎన్నో అంశాలపై ఇద్దరూ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్ జోడో యాత్రకు మద్దతు తెలిపినందుకు రాహుల్..కమల్ హాసన్‌కు థాంక్స్ చెప్పారు. ఆ తరవాత కమల్..బీజేపీపై విరుచుకు పడ్డారు. "దేశ రాజకీయాల్లో ఇవాళ ఏం జరుగుతోందో మాట్లాడాల్సిన సమయం వచ్చింది. చెమట, రక్తం ధార పోసి మరీ ఇన్ని వేల కిలోమీటర్లు మీరు యాత్ర చేశారు" అని రాహుల్‌ను ప్రశంసించారు. మహాత్మా గాంధీ గురించి కూడా ప్రస్తావించారు. "నా 24-25 ఏళ్ల వయసులో గాంధీని అర్థం చేసుకున్నాను. అందుకే హే రామ్ సినిమా తీశాను. ఆయనకు నా సినిమా ద్వారా సారీ చెప్పాను" అని అన్నారు కమల్. 






కమల్‌కు గిఫ్ట్ ఇచ్చిన రాహుల్ 


ఆ తరవాత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "విద్వేషం కారణంగా మన కళ్లు మూసుకుపోతాయి. అపార్థాలూ వస్తాయి" అని
అన్నారు. ఇందుకు కమల్ బదులిస్తూ  "ఈ విద్వేషం హత్యలూ చేయిస్తుంది" అని స్పష్టం చేశారు. ఇక తమిళ భాష గురించి కూడా ఘాటుగా మాట్లాడారు కమల్. కేంద్రం పదేపదే హిందీని జాతీయ భాష చేస్తామంటూ సంకేతాలిస్తున్న నేపథ్యంలో...మోడీ సర్కార్‌కు చురకలు అంటించారు. "అందరిలాగే మేమూ మా మాతృభాషను గౌరవిస్తున్నాం. గర్విస్తున్నాం. మతం, దేవుడు లాంటి విశ్వాసాలు లేని వాళ్లు
కూడా తమిళాన్ని గౌరవిస్తున్నారు" అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ..కమల్‌ హాసన్‌కు ఓ గిఫ్ట్ కూడా ఇచ్చారు. పులి నీళ్లు తాగుతున్న ఫోటో ఫ్రేమ్‌ను బహుకరించారు. "జీవితాన్ని మీరు చూసే కోణం అద్భుతం. ఈ ఫోటో మీ వైఖరికి అద్దం పడుతుంది. మీరు గొప్ప ఛాంపియన్" అంటూ కమల్‌ను ప్రశంసించారు రాహుల్.   


Also Read: Delhi Girl Dragged Case: ప్రమాదం జరిగిందా, హత్య చేశారా - కంజావాలా ఘటనపై ఎన్నో అనుమానాలు