Delhi Girl Dragged Case:


యువతి మృతి 


ఢిల్లీలో మహిళల పట్ల జరుగుతున్న నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. కొత్త ఏడాది మొదటి రోజే దారుణం జరిగింది. ఔటర్ ఢిల్లీలోని సుల్తాన్‌పురలో 20 ఏళ్ల యువతి స్కూటీ నడుపుతుండగా...ఓ కార్ వచ్చి ఢీకొట్టింది. ఆ స్కూటీని అలాగే నాలుగు కిలోమీటర్ల మేర లాక్కుని వెళ్లింది. ఈ ఘటనలో ఆ యువతి మృతి చెందింది. ఇప్పటికే పోలీసులు ఈ కేసుపై విచారణ కొనసాగిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం పోలీసులపై విశ్వాసం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. విచారణ సరైన రీతిలో జరిపిస్తారన్న నమ్మకం లేదని అంటున్నారు. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని, ఎవరో కావాలనే హత్య చేశారని అనుమానిస్తున్నారు. నిందితులను కాపాడేందుకే పోలీసులు సరిగా విచారించడం లేదని ఆరోపిస్తున్నారు. సుల్తాన్‌పురి లోని కంజావాలా ప్రాంతంలో జరిగిందీ ఘటన. దీనిపై మృతురాలి తల్లి చాలా భావోద్వేగంగా మాట్లాడారు. "రాత్రి 9 గంటలకు నేను తనతో మాట్లాడాను. తెల్లవారు జామున 3-4 గంటల వరకూ వచ్చేస్తాను అని చెప్పింది. పెళ్లిళ్లలో ఈవెంట్ ప్లానర్‌గా పని చేస్తుండేది. ఉదయం పోలీసులు నాకు కాల్ చేసి యాక్సిడెంట్ గురించి చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ చాలా సేపు వెయిట్ చేయించారు" అని వివరించారు. ఇది హత్య అని, తన కూతురుని చంపే ముందు ఆ వ్యక్తి లైంగికంగా వేధించాడని ఆరోపిస్తున్నారు మృతురాలి తల్లి. "మా తమ్ముడు పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. నా కూతురు చనిపోయిన విషయాన్ని చెప్పాడు. నా కూతురే కుటుంబాన్ని పోషిస్తోంది. ఇంటి నుంచి నిండు దుస్తులతో వెళ్లిన తన ఒంటి మీద నూలు పోగు కూడా లేదు. ఇది యాక్సిడెంట్ ఎలా అవుతుంది" అని ప్రశ్నించారు. 










కేజ్రీవాల్ స్పందన..


ఈ ఘటనపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ఇందుకు  బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. "కంజావాలాలో ఆ సోదరికి జరిగి అన్యాయాన్ని ఖండిస్తున్నాను. ఇదెంతో సిగ్గు చేటు. నిందితులను కఠినంగా శిక్షిస్తారని నమ్ముతున్నాను" అని ట్వీట్ చేశారు.