టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటున్న సభల్లో వరుసగా జరుగుతన్న తొక్కిసలాట దుర్ఘటనలపై అధికార ప్రతిపక్షాల మధ్య మాట తూటాలు పేలుతున్నాయి. పోలీసులు, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇలాంటి పరిస్థితి వస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. దానికి కౌంటర్‌గా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, మంత్రులు ఘాటుగా బదులిస్తున్నారు.
మొన్న కందుకూరు ఘటన, నిన్న గుంటూరు తొక్కిసలాట ముమ్మాటికి ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమే కారణమంటూ ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. తగిన బందోబస్తు కల్పించి ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావంటూ ఫైర్ అయ్యారు. వేల మంది ప్రజలు వస్తుంటే తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులపై లేదా అని ప్రశ్నించారు. సాయం చేయాల్సింది పోయి అవసరమైన విమర్శలు చేస్తూ తప్పును వేరే వాళ్లపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
టీడీపీ చేస్తున్న విమర్శలకు ఘాటుగా బదులిస్తోంది వైఎస్‌ఆర్‌సీపీ లీడర్లు, మంత్రులు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగానే అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయంటూ మండిపడ్డారు మాజీ మంత్రి కొడాలి నాని. సభల కోసం జనాలను తీసుకొచ్చి ఇరుకు సందల్లో ఉంచి డ్రోన్లతో షూట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న కందుకూరు, నిన్న గుంటూరు దుర్ఘటనలకు చంద్రబాబు, లోకేష్, టీడీపీ, మీడియా అధినేతలను బాధ్యులగా చేయాలని నాని డిమాండ్ చేశారు. కానుకలు, చీరలు అంటూ దొంగమాటలు చెప్పారని... గంటలు గంటలు స్పీచ్‌లు ఇచ్చి చివరకు నాలుగు చీరలు పంచారని విమర్శించారు. దీని కారణంగానే తొక్కిసలాట జరిగిందన్నారు.
చంద్రబాబు పేద ప్రజల ఉసురు తీసుకుంటున్నారని మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. తన కోసమే జనాలు వస్తున్నారన్న ఎత్తుగడతో ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ మరణాలన్నీ చంద్రబాబు చేస్తున్న హత్యలేనంటూ ధ్వమెత్తారు. ఆయన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మీటింగ్స్‌కు పర్మిషన్ ఇవ్వొద్దని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. 30వేల మందికి టోకెన్లు పంచి.. 3వేల మందికి కూడా చీరలు పంచలేదన్నారు.
బీజేపీ కూడా చంద్రబాబుపై విమర్శలు చేసింది. గుంటూరులో జరిగిన బహిరంగ సభలో ఉచిత కానుకల పంపిణి తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మరణించటం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేసింది. వారం రోజుల్లో ఇది రెండో దుర్ఘటన అని... పదవీ కాంక్షతో, ప్రచార పిచ్చితో బహిరంగ సభల్లో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని చంద్రబాబుపై విమర్శలు చేసింది. అలాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించరని అభిప్రాయపడింది.