బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో ఆశలు చిగురిస్తున్నాయి. పార్టీని ఏపీలో వేగంగా వ్యాప్తి చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఇటీవల టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చుకున్నారు కేసీఆర్. రాష్ట్ర స్థాయిలో కాదు, దేశ స్థాయిలో చక్రం తిప్పే సమయం వచ్చిందని సైతం వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల కిందట ఏపీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు సైతం దర్శనమివ్వడం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఏపీ నుంచి మరో కీలక అప్ డేట్ వచ్చింది. ఏపీ నుంచి ఓ మాజీ మంత్రితో పాటు, మాజీ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ పార్థసారథి జనవరి 2వ తేదీన బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో వీరితో పాటు మరికొందరు గులాబీ పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర విద్యార్థి, యువజన జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ ఓ ప్రకటనలో తెలిపారు.


దేశ భవిష్యత్ కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏపీకి చెందిన పలువురు ముఖ్యమైన వ్యక్తులు, నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది. ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ - సీనియర్ నేత తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథిలతో పాటు అన్ని జిల్లాలకు చెందిన వేలాది మంది జనవరి 2న బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో చేరనున్నట్లు ఏపీ యూత్, స్టూడెంట్స్ జేఏసీ పేర్కొంది.


బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడుగా ఆయనకే పగ్గాలు !
బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ ను నియమించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 2న మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్యలో తెలంగాణ భవన్ లో ఏపీ నుంచి నేతలు, మాజీ అధికారులు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీలో చేరునుండగా.. కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానం పలకనున్నారు. 2019లో గుంటూరు పశ్చిమ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రశేఖర్ ఓటమిచెందారు. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న చంద్రశేఖర్, తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనను గమనించి బీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.


విభజిత ఏపీలో గడిచిన తొమ్మిది సంవత్సరాలలో మాజీ సీఎం చంద్రబాబు, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అధ్వాన్న పాలనతో రాష్ట్రంలో అన్ని రంగాలు నష్టపోయాయని అన్నారు. రాష్ట్ర యువతతో పాటు రైతులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాలకు తీరని నష్టం జరిగిందని స్టూడెంట్స్ జేఏసీ ఆరోపించింది. వ్యవసాయ, సంక్షేమరంగాలతో పాటు అన్నిరంగాలు విధ్వంసానికి గురయ్యాయని.. అన్ని వనరులు ఉన్నప్పటికీ ఏపీని ఆదుకునే నాయకుడు లేక ప్రజలతో పాటు అన్ని వర్గాల వారు అల్లాడుతున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమ నేతగా, సకల జనుల సంక్షేమం దిశగా పాలన పరిపాలనధక్షుడిగా ముందుకు సాగుతోన్న సీఎం కేసీఆర్ లాంటి నేత నాయకత్వం ఏపీకి అవసరం అన్నారు. కేసీఆర్ పాలనతోనే ఏపీ సమస్యలు తీరుతాయని కీలక విషయాలను ప్రస్తావించారు.