ఏపీలో అధికారపార్టీ వైఎస్సార్‌సీపీలో ఏదో చోట అసమ్మతి గళం వినిపిస్తూనే ఉంటుంది. గత వారం ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు. కేవలం పింఛన్లు ఇస్తే, ఆ విషయం చెప్పి ప్రచారం చేస్తే ఓట్లు పడే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు ఆనం రామనారాయణరెడ్డి. ఈ విషయంపై వైసీపీ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు ఆనంపై మండిపడ్డారు. ప్రస్తుతం టీడీపీ నేత బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో అధికార పార్టీలో విభేదాలు మళ్లీ రచ్చకెక్కాయి. 


వైసీపీ నేత, ఏపీ అగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ చేసిన వ్యాఖ్యలు హిందూపురం వైసీపీలో దుమారం రేపుతున్నాయి. 2013 నుంచి వైసీపీ జెండా మోసిన వారికి పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. 2013లో పార్టీ జెండా పట్టుకోమంటే మైళ్ల దూరం పరుగెత్తిన నేతలకు పిలిచి పదవులు ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము పార్టీ ఏర్పాటైన రోజు నుంచి వైసీపీ పల్లకి మోస్తున్నామని, కానీ నేటికీ ఆ పల్లకిలో కూర్చునే అవకాశం అధిష్టానం ఇవ్వలేదంటూ నవీన్ నిశ్చల్ కామెంట్ చేశారు. వైసీపీలో కొందరు వలసదారులు ఉన్నారని, అలాంటి వారికి హిందూపురం టికెట్ ఇస్తే ఇబ్బందులు తప్పవన్నారు. ఆ నేతలు టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీని వీడుతారని వ్యాఖ్యానించారు. 


ఆగ్రోస్‌ ఛైర్మన్‌ నవీన్‌ నిశ్చల్‌ తన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో వలసదారులు ఉన్నారని, అలాంటి వారికి హిందూపురం టికెట్ ఇస్తే పార్టీని నమ్ముకున్న వారికి ఇబ్బందులు తప్పవన్నారు. ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీని వీడి ఆ వలసదారులు పచ్చ పార్టీలో చేరే వ్యక్తులు అన్నారు. కనుక అలాంటి వలసదారులకు టికెట్ ఇవ్వవద్దని ఈ సందర్భంగా అధిష్టానాన్ని కోరారు. వైసీపీలో కొనసాగుతున్న వలసదారులను పార్టీ కార్యకర్తలే తరిమికొట్టాల్సిన సమయం వచ్చిందని తమ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాంటి వలస నేతల వల్ల పార్టీకి, కార్యకర్తలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. 


అంత తొందరెందుకు..? 
ఎన్నికలకు ఏడాది ఉండగానే తన కుర్చీ లాగేయాలని కొంతమంది చూస్తున్నారని చెప్పారు ఆనం రామనారాయణ రెడ్డి. తనను ఐదేళ్ల కు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని.. మరో  ఏడాది వరకు ఆ సీటు తనదేనని, ఆ తర్వాత వారు ఎక్కడ కూర్చున్నా ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. జగనన్న ముద్ర ఉందని అలాంటివారు చెప్పుకుంటున్నారని, కానీ తనకు ప్రజలు ఇచ్చిన రాజ ముద్ర ఉందని అన్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో తాను నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతల్ని భుజాన మోస్తున్నానని అన్నారు ఆనం.


ప్రభుత్వంపై వరుస విమర్శలు ! 
ఏం పనులు చేశామని జనం మనకు ఓట్లు వేస్తారంటూ గత బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసిన వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఆ తరువాత మరో రూపంలో తన అసంతృప్తి బయటపెట్టారు. ఇటీవల వెంకటగిరి సీటుకి తాను కూడా పోటీ ఉన్నానంటూ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మీడియాకు ఇంటర్వ్యూలిచ్చారు. పరోక్షంగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఎన్నికలకు ఏడాది ముందే కొంతమంది వెంకటగిరిపై ఆశపడుతున్నారన, తన సీటుకి ఎసరు పెట్టాలనుకుంటున్నారని చెణుకులు విసిరారు. మీకు జగనన్న ముద్ర ఉంటే నాకు రాజముద్ర ఉందని చెప్పారు ఆనం. నేనున్నంత వరకు నా కుర్చీ నాదే, ఆ తర్వాత మీ ఇష్టం అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇక్కడుంటానే, వేరే దగ్గరకి పోతానా, అసలు ఇంటికే పోతానా అనేది తర్వాతి విషయం అన్నారు. అయితే తానున్నంత వరకు అధికారులతో కలసి  పనిచేస్తాను, చేయిస్తానని చెప్పారు. ఈ బాధలు, ఇబ్బందులు, సమస్యల మధ్య వాలంటీర్లు, కన్వీనర్లతో కలసి పోరాటం చేయడం తనకో గొప్ప అవకాశం అన్నారు ఆనం.