చలికాలం వచ్చిందంటే కొంతమంది భయపడిపోతారు. జలుబు, జ్వరం, దగ్గు వేధిస్తూ సంతోషాల్ని ఆరోగ్యాన్ని దూరం చేస్తుంది. చల్లటి వాతావరణం కారణంగా శ్వాస సమస్యలు ఇబ్బంది పెడతాయి. వాటన్నింటిని అధిగమించేందుకు ఆయుర్వేదంలో చక్కని పరిష్కారం ఉంది. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఆయుర్వేద మూలికలు ఆహారంలో భాగం చేసుకుంటే ఎటువంటి అనారోగ్యం కూడా దరిచేరదు. శీతాకాలంలో కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు.


లెమన్ థైమ్


ఎన్నో ఔషధ గుణాలు కలిగిన లెమన్ థైమ్ మొక్క క్రిమినాశక లక్షణాలని కలిగి ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శీతాకాలంలో ఛాతీ, గొంతు ఇన్ఫెక్షన్లకి చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక కప్పు వేడి నీటిని తీసుకొని లెమన్ థైమ్ రెమ్మని జోడించుకోవచ్చు. ఇన్ఫెక్షన్ ని బట్టి రోజుకు 2-3 సార్లు లెమన్ థైమ్ వాటర్ లేదా టీ వడకట్టుకుని తాగొచ్చు. ఇందులో కొంచెం తేనె కూడా జోడించుకోవచ్చు.


కలేన్ద్యులా


దీన్నే పాట్ మేరీగోల్డ్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క పువ్వులు చాలా ప్రసిద్ధి చెందినవి. యాంటీ వైరల్ లక్షణాలని కలిగి ఉంటుంది. ఇన్ఫెక్షన్లని క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ, కాలేయం, పిత్తాశయాన్ని క్లీన్ చేస్తుంది. 2 టీ స్పూన్ల కలేన్ద్యులా రేకులను 750ఎంఎల్ వాటర్ లో వేసుకుని బాగా 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. రోజుకు ఐదు కప్పుల వరకు తాగొచ్చు.


పార్స్లీ


వంటకాల మీద గార్నిషింగ్ కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో విటమిన్లు ఏ, ఇ,, ఐరన్ తో పాటు మంచి మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన పార్స్లీని డిటాక్స్ హెర్బ్ గా పరిగణిస్తారు. టాక్సిన్స్ క్లియర్ చేసి అలసటని తొలగించడంలో సహాయపడుతుంది. సలాడ్ లేదా తీసుకునే ఏదైనా ఆహారానికి దీన్ని జోడించుకుని తినొచ్చు. సీజనల్ జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒక కప్పులో 1-2 టేబుల్ స్పూన్ల తాజా పార్స్లీ ఆకులని వేడి నీటిలో వేసుకోవాలి. 5-7 నిమిషాల తర్వాత వాటిని తాగాలి. రోజుకి రెండు లేదా మూడు సార్లు తాగాలి. ఇది చూసేందుకు కొత్తిమీర మాదిరిగానే కనిపిస్తుంది.


తులసి


తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఔషధ గుణాలు కలిగిన తులసి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణక్రియని వేగవంతం చేస్తుంది. మనసు, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. తులసి ఆకుల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి వైరస్, ఇన్ఫెక్షన్లు, అలర్జీలతో పోరాడగలవు. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందటం కోసం సాధారణ టీలో తులసి ఆకులు లేదా పొడి వేసుకుని తాగొచ్చు.


లిక్కోరైస్


శతాబ్దాలుగా లిక్కోరైస్ గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందటం కోసం ఉపయోగిస్తున్నారు. ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులకి చికిత్స చేయడంలో సహాయపడే అధ్భుతమైన హెర్బ్. శీతాకాల వ్యాధులతో శరీరం పోరాడటానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల చర్మ సమస్యలు కూడా నయం చేస్తుంది. దీని పొడిని తేనె, నెయ్యితో కలుపుకుని తీసుకోవచ్చు.


పుదీనా ఆకులు


పుదీనా ఆకులతో చేసిన టీ తాగడం వల్ల అజీర్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. జలుబు కారణంగా వచ్చే తలనొప్పికి చికిత్స చేయడంలో సహాయపడుతుంది. ఆస్తమాని నయం చేస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: ఈ ఆహార పదార్థాలు తిన్నారంటే నిగనిగలాడే మెరుపు మీ సొంతం