మనకు తెలిసిన పసుపు కొమ్ము... పసుపు రంగులోనే ఉంటుంది. కానీ వాటిలో నీలం రంగులో ఉండే పసుపు కొమ్ములు కూడా ఉన్నాయి. దీన్ని హిందీలో ‘కాలీ హల్దీ’ అంటారు. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో వీటిని కొన్నిచోట్ల వాడతారు. ఈ మూలికను ముక్కలు చేసి చూస్తే లోపల అంతా నీలంగా ఉంటుంది. ఇది ఎక్కడపడితే అక్కడ పండదు తేమతో కూడిన అటవీ ప్రాంతాల్లోనే పెరుగుతుంది. ఎక్కువగా ఈశాన్య భారతదేశంలో కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలో చాలా అరుదుగా పెరుగుతుంది.


దీని రుచి, కాస్త కారంగా చేదుగా ఉండి, వాసన ఘాటైన కర్పూరంలాంటి సువాసనను విడుదల చేస్తుంది. వీటి రుచి అంత బాగోదు కనుక, వీటిని ఆహారంలో పెద్దగా ఎవరు తినరు. కాకపోతే దీన్ని ఔషధాలలోఉపయోగిస్తారు. చాలా గిరిజన తెగలలో గాయాలు, చర్మపు సమస్యలకు, పాము, కీటకాల కాటులకు ఈ నల్ల పసుపును పేస్టుగా మార్చి అద్దుతారు. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయని వారి నమ్మకం. కడుపునొప్పిని తగ్గించడానికి, జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగించడానికి ఇది ఎంతో మంచిదని అంటారు. 


కాళీ మాతకు...
ఈ నీలం పసుపు పొడిని నీళ్లలో కలిపి నుదుటిపై పేస్టులా రాసుకుంటే తలనొప్పి తగ్గుతుందని చెబుతారు. ఈ నీలం పసుపుకు హిందూ దేవత అయిన కాళీమాతకు దగ్గర సంబంధం కలిగి ఉందని ఎంతో మంది నమ్మకం. కాలా అంటే నలుపు అని అర్థం. ఈ నల్ల పసుపు కాళీమాత యొక్క చర్మపు రంగును గుర్తుకు తెస్తుందని అంటారు. అందుకే కాళీ మాత పూజల్లో నైవేద్యంగా ఈ నీలం పసుపు కొమ్మును ఉంచుతారు. కాళీ పూజ సాంప్రదాయబద్ధంగా అశ్వయుజ మాసంలో అమావాస్య రోజున జరుపుకుంటారు. ఆ రోజున ఈ నల్ల పసుపును కాళీమాతకు నైవేద్యంగా ఇస్తారు. అలాగే కొన్ని కమ్యూనిటీలలో ఈ నల్ల పసుపు జేబులో పెట్టుకుంటారు. దీనివల్ల దుష్టశక్తుల నుండి రక్షణ లభిస్తుందని ఎంతో మంది నమ్మకం. ఈ నల్ల పసుపుతో కషాయాన్ని కూడా తయారు చేస్తారు. నీళ్లలో కలిపి తాగితే రోగనిరోధక శక్తిని పెంచుతుందని, అలాగే పోషకాహార సప్లిమెంట్ గా కూడా పనిచేస్తుందని నమ్మకం. వీటిని పౌడర్లు, స్మూతీలుగా మార్చి అమ్ముతారు.  దీని రుచి చేదుగా ఉంటుంది కాబట్టి ఆ రుచిని సమతుల్యం చేయడానికి తేనె, చెరకు రసం వంటి వాటిలో కలుపుకుని తాగతారు. ఈ పసుపు పొడిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నాలుగు నుంచి ఆరు నెలల వరకు నిల్వ చేయవచ్చు.


Also read: ఆయుర్వేద మందులతో కీళ్ల నొప్పులకు ఇలా చెక్ పెట్టండి







































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.