నేడు బీజేపీ కార్యాలయంలో సమ్మేళనం. 119 నియోజకవర్గాల వారిగా మొదటిసారి. 


బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమావేశంజరగనుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఈ సమావేశంలో ప్రసంగిస్తారు. 119 నియోజకవర్గాల్లో బూత్ కమిటీ ల్లో బీజేపీ పార్టీని పటిష్టం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. 119 నియోజకవర్గాల అంతటా ఈ తరహా సమ్మేళనం నిర్వహించడం మొదటసారి. 


నేటి నుంచి సంక్రాంతి కి తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు


తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండగ సంక్రాంతి. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు పండుగ కోసం వెళ్లే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బస్సులు ఇవాళ్టి నుండి ఈ నెల 14 వరకు నడవనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం సాధారణ చార్జీలతోనే బస్సులు నడిపిస్తున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. తెలంగాణ ఆర్టీసీ ఈసారి 4వేల 233 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది. ఒకేసారి తిరుగు ప్రయాణానికి కూడా టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇక ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఎండీ సజ్జనార్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ప్రయాణికులకు ఎప్పటికప్పుడు బస్సులు అందించడానికి రద్దీ ప్రాంతాల్లో అధికారులు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.  సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం అడ్వాన్స్‌డ్‌ టికెట్ బుకింగ్‌ను 30 నుంచి 60 రోజులకు పెంచారు. ఈ ఏడాది జూన్ వరకు ఈ బుకింగ్‌ సదుపాయం అందుబాటులో ఉంటుంది. 4వేల 233 ప్రత్యేక బస్సుల్లో 585 సర్వీస్‌లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. పండుగ సందర్భంగా ఆంద్రప్రదేశ్‌కి రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి వాటిలో అమలాపురం 125, కాకినాడ 117, కందుకూరు 83, నర్సాపురం 14, పోలవరం 51, రాజమండ్రి 40, రాజోలు 20, ఉదయగిరి 18, విశాఖపట్నం 65, నెల్లూరు 20, ఒంగోలు 13, గుంటూరు 12, విజయవాడ 9 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది.


తెలంగాణపై చలిపంజా.. 


ఉత్తర/ఈశాన్య గాలుల ప్రభావం వల్ల రాష్ట్రంపై చలిపంజా విసురుతున్నది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ కూడా వాతావరణం చల్లగా ఉంటున్నది. మరోవైపు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పెద్దపల్లి, నల్గొండ, జగిత్యాల జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురులో అత్యధికంగా 16.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట, వరంగల్‌, జనగాం, మేడ్చల్‌-మలాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, వికారాబాద్‌, నాగర్‌ కర్నూల్‌, ములుగు, నిజామాబాద్‌, కుమ్రం భీం జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌ నగర వాతావరణం కశ్మీర్‌ను తలపిస్తున్నది. గడిచిన రెండు రోజులుగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శుక్రవారం గ్రేటర్‌వ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురిశాయి. తెల్లవారుజాము నుంచి దాదాపు ఉదయం 8 గంటల వరకు నగరం మంచు దుప్పటి కప్పుకున్నట్టు కనిపించింది. మరో రెండు రోజులు ఈ గాలులు వీచే అవకాశం ఉండటంతో గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.