చర్మ సౌందర్యం కోసం ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ మనం ఏం తింటున్నాం అనేది చాలా ముఖ్యం. మన అందం మనం తీసుకునే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటే చర్మం అందంగా మెరిసిపోతూ కనిపిస్తుంది. ఈ కొత్త ఏడాది సరికొత్తగా అందంగా కనిపించాలని అనుకుంటే మీ డైట్ లో ఈ ఆహార పదార్థాలు తప్పనిసరిగా చేర్చుకుని చూడండి. నిగనిగలాడే మేని ఛాయ పొందుతారు.
చియా విత్తనాలు
ప్రోటీన్, విటమిన్లు బి1, బి2, ఇ, బి3 లభించే ఉత్తమ మూలం. ఇతర పోషకాలు, ఖనిజాలు అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. అన్నింటికంటే ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఇందులో సమృద్ధిగా ఉన్నాయి. ఇవి వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది. ముడతలు, మొటిమల మచ్చలని తగ్గిస్తుంది. చర్మం ఎప్పుడు మెరుస్తూ ఉండేలా చేస్తుంది. చియా గింజల్లోని అధిక స్థాయి యాంటీ ఆక్సిడెంట్లు UV ఎక్స్పోజర్ వల్ల కలిగే ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి.
తులసి
ఎన్నో ఔషధ గుణాలు కలిగిన పవిత్రమైన తులసి తినడం వల్ల ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. చర్మ సంరక్షణకి అధ్భుతమైన మూలికల్లో ఇది ఒకటి. తులసిలో క్రిమినాశక గుణాలు ఉన్నాయి. ఇది చర్మం, జుట్టుకి మెరుగైన సంరక్షణ కలిగిస్తుంది. తులసి పేస్ట్ ను అప్లై చేయడం లేదా నేరుగా తినడం వల్ల ప్రకాశవంతమైన స్కిన్ టోన్ ను పొందుతారు. జుట్టుకి క్రమం తప్పకుండా అప్లై చేస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది.
పండ్లు
కాలానుగుణ పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు పుష్కలంగా అందుతాయి. రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ ని దూరంగా ఉంచుతుందని అందుకే అంటారు. క్రమం తప్పకుండా పండ్లు తినడం వల్ల చర్మానికి మేలు చేస్తుంది. నారింజ, పుచ్చకాయలు, నిమ్మకాయ, మామిడి, స్ట్రాబెర్రీ, దోసకాయలు, దానిమ్మ వంటి వాటిని తీసుకోవడం వల్ల మెరిసే, ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందటానికి సహాయపడుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, డైటరీ ఫైబర్ ఉంటుంది. చర్మాన్ని డ్యామేజ్ కాకుండా రక్షిస్తూ యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్‌లో బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇందులోని ఫ్లేవనోల్స్ సూర్యరశ్మి నుండి రక్షించడానికి, చర్మానికి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ ని తగ్గించడంలో మెరుగ్గా పని చేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.
గ్రీన్ టీ
విటమిన్ ఇ పుష్కలంగా ఉండే గ్రీన్ టీ తీసుకోవడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. చర్మానికి కావాల్సిన పోషణ ఇస్తూ హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇది చర్మాన్ని మాయిశ్చరైజర్ చేయడమే కాకుండా కాంతివంతంగా ఉంచి రిపేర్ చేస్తుంది. స్కిన్ డ్యామేజ్, మొటిమల వల్ల వచ్చే నల్ల మచ్చలు ఇతర చర్మ చికాకులని తగ్గిస్తుంది. అంతే కాదు గ్రీన్ టీలో డిటాక్సింగ్, మంటని తగ్గించి రక్తపోటు, కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుతుంది.
పసుపు
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్న పసుపు రాసుకోవడం వల్ల చర్మం మెరిసిపోతుంది. స్కిన్ కి హాని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. మొటిమలు నివారించి, వృద్ధాప్య సంకేతాలు కనిపించకుండా చేస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: చలికాలంలో ఆరోగ్యం ఉండాలంటే ఈ జ్యూస్ తాగండి - రోగ నిరోధక శక్తి పెరుగుతుంది