Bhogi Goda Kalyanam 2023:  ఏటా భోగి రోజు గోదాదేవి రంగనాథుల కళ్యాణం జరుగుతుంది. వైష్ణవ ఆలయాల్లో జరిగే ఈ కళ్యాణ వేడుక తిలకించేందుకు రెండుకళ్లు సరిపోవు...గోదాదేవి శ్రీ రంగనాథుడిలో ఐక్యం అయ్యే ఆ వేడుక చూసిన అవివాహితులకు కళ్యాణ యోగం, పెళ్లైన వారికి జీవితంలో సంతోషం తథ్యం అని చెబుతారు పండితులు


ఎవరీ గోదాదేవి
శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే గొప్ప భక్తుడు ఉండేవాడు. ఈ ఊరిలోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ (వటపత్రశాయి) లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే. నిత్యం ఆ కృష్ణునికి పూలమాలలు  అర్పిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకునేవాడు విష్ణుచిత్తుడు. విష్ణుచిత్తుని అసలు పేరు భట్టనాథుడు...నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి విష్ణుచిత్తుడు అంటారు. విష్ణుచిత్తుడు సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువును దర్శించి ఆయనకు మంగళాశాసనాలు అర్పించినట్లు ఒక గాథ ప్రచారంలో ఉంది. అందుకే ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి, ఆయనకు పెరియాళ్వారు (పెద్ద ఆళ్వారు) అన్న గౌరవాన్ని అందించారు. పెరియాళ్వారు ఒకరోజు తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక చిన్నారి కనిపించింది. ఆమెను సాక్షాత్తూ ఆ భగవంతుని ప్రసాదంగా భావించి పెంచుకున్నాడు. ఆమెకు ‘కోదై’ (పూలమాల) అనే పేరసు పెట్టాడు..ఆ పేరే క్రమంగా గోదాగా స్థిరపడింది.


Also Read: భోగి పళ్లు ఎందుకు పోస్తారు, రేగుపళ్లనే ఎందుకు పోయాలి!


కన్నయ్యను ఆరాధిస్తూ పెరిగిన గోదా
గోదాదేవి చిన్నప్పటి నుంచీ కృష్ణుడిని ఆరాధిస్తూ పెరిగింది. తన చుట్టూ ఉన్నవారంతా గోపికలు అని ...తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి వ్రజపురమని భావించింది. అంతేకాదు! తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం సిద్ధం చేసిన మాలను ముందుగా తాను ధరించి తన మెడలో శ్రీకృష్ణుడు వేసినట్టు భావించి మురిసిపోయేది. ఓ రోజు ఈ దృశ్యం చూసిన విష్ణుచిత్తుడు.. తనకు తెలియకుండా అపచారం జరిగిపోయిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తూ ఆ భూదేవి అవతారమేననీ, ఆమె స్పృశించిన మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదు ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు. దీంతో గోదాదేవికి కృష్ణుడిపై ప్రేమను మరింత పెరిగింది. తనకు పెళ్లైనట్టు భావించి..ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. అలా తాను వ్రతాన్ని పాటించడమే కాదు తన చెలికత్తెలని కూడా తనతో కలిసి వచ్చేందుకు సిద్ధం చేసింది. తన చెలులను మేల్కొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలిపేందుకు, తనలోని కృష్ణభక్తిని వెల్లడించేందుకు రోజుకో  పాశురసం చొప్పున 30 పాశురాలను పాడింది గోదా. అవే ధనుర్మాసంలో  ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై!


Also Read: వేదాల్లోనూ నార్త్ కే ఎందుకు ఎక్కువ ప్రయార్టీ, కాలాల్లోనూ ఉత్తరాయణమే పుణ్యకాలం ఎందుకంటే!


గోదా ప్రేమకు కరిగిపోయిన కృష్ణుడు
ఎట్టకేలకు గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. తానే స్వయంగా విష్ణుచిత్తునికి కనిపించి, తానుండే శ్రీరంగానికి గోదాదేవిని తీసుకురమ్మనీ అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహమాడతాననీ చెప్పాడు.  శ్రీరంగంలోని ఆలయ అర్చకులకూ విషయాన్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేవు. వెంటనే గోదాదేవినీ, విల్లిపుత్తూరులోని ప్రజలనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. పెళ్లికూతురిగా అంతరాలయంలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగినాడు జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి వైష్ణవాలయంలోనూ భోగిరోజు గోదాదేవికి ఆ రంగనాథునితో వైభవంతా కళ్యాణం జరుపుతారు. 


పెళ్లికాలేదని బాధపడుతున్నవారు, కళ్యాణానికి ఆటంకాలు ఎదుర్కొంటున్నవారసు...భగవంతుడిపై మనసు లగ్నంచేసి గోదా రంగనాథుల కళ్యాణం చూస్తే అంతా మంచే జరుగుతుందని చెబుతారు. వైవాహిక జీవితంలో కలతలు కూడా తొలగిపోతాయంటారసు పండితులు. 


2023లో జనవరి 14 శనివారం భోగి
జనవరి 15 ఆదివారం సంక్రాంతి
జనవరి 16 సోమవారం కనుమ
జనవరి 17 మంగళవారం ముక్కనుమ