‘వీరసింహా రెడ్డి’ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే సినిమా అవుతుందని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. అలాగే చెంఘిజ్ ఖాన్ కథతో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నానని, అది ఎప్పటికైనా చేస్తానని తెలిపారు. ఒంగోలులో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి హీరోయిన్లు శ్రుతి హాసన్, హనీ రోజ్, దర్శకుడు గోపిచంద్ మలినేని, నిర్మాతలు సహా చిత్రబృందం హాజరైంది.
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘నాకు జన్మనిచ్చి, మీ అందరి గుండెల్లో నన్ను నిలిపినందుకు నా తండ్రి ఎన్టీఆర్ కు ధన్యవాదాలు. అలాంటి నటుడు మరొకరు లేరన్న విషయాన్ని ప్రతి నటుడూ అంగీకరించక తప్పదు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. వీరసింహా రెడ్డి వేడుకకు అందాన్ని, పెద్దరికాన్ని తీసుకొచ్చేది దర్శకుడు బి.గోపాల్ మాత్రమే అనుకుని ఆయన్ను ఆహ్వానించాం.’
‘నటులు, టెక్నిషియన్ల నుంచి పూర్తిస్థాయిలో ప్రతిభను వెలికితీయగల సత్తా ఉన్న ఒంగోలు గిత్త మన గోపీచంద్ మలినేని. ఈయనే కాదు నా తర్వాతి సినిమా దర్శకుడు అనిల్ రావిపూడిది కూడా ఒంగోలే. నేనెప్పుడూ రాయలసీమకు సంబంధించిన సినిమాలకు పరిమితమవుతానని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అది ఏ మాత్రం నిజం కాదు. చాలా రకాల సినిమాలు చేసినా నాకు ఇంకా అస్సలు కసి తీరలేదు. భిన్నమైన పాత్రలు పోషించడం, బాధ్యతలు నిర్వహించడంలోనే నాకు సంతృప్తి.’
‘బాలకృష్ణ సినిమాలు, రాజకీయాలకే పరిమితం అని అనుకునే వారికి సమాధానం ఆహా ద్వారా నేను చేస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం. టాక్ షోలలో అది ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే చిత్రాల్లో వీరసింహారెడ్డి ఉంటుంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేశారు.‘
‘ఇక దునియా విజయ్ కన్నడ చిత్ర పరిశ్రమలో కథానాయకుడు అయినా ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించడం గొప్ప విషయం. నేను కూడా సప్తగిరి నుంచి కామెడీ టైమింగ్ నేర్చుకోవాలి. తమన్ సంగీతం అందించిన పాటలు ఎలా ఉన్నాయో అందరూ చూశారు. థియేటర్లలో రీరికార్డింగ్ కు ఎన్ని సౌండ్ బాక్సులు బద్దలవుతాయో త్వరలో చూస్తారు. ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా రాసిన మాటలు బాగా పేలతాయి. ఇది చాలా అద్భుతమైన సినిమా. ఇది బాగా ఆడాలని కోరుకోను. ఎందుకంటే కచ్చితంగా బాగా ఆడి తీరుతుంది.’ అన్నారు.