బాలయ్య కొత్త సినిమా అంటే కచ్చితంగా పంచ్ డైలాగుల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అందులోనూ ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ బాగా పెరిగింది. టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ మంటలో కాస్త పెట్రోల్ పోశారు వీరసింహారెడ్డి. తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్ లో కొన్ని డైలాగ్ లపై చర్చ మొదలైంది.
బాలయ్య సినిమా, అందులోనూ ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగా విడుదలవుతున్న సినిమా, కచ్చితంగా నందమూరి అభిమానులు ఏదో ఆశిస్తుంటారు, వారి ఆశల్ని, అంచనాల్ని నిజం చేస్తూ ట్రైలర్ ని మాస్ మసాలాతో నింపేశారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఒంగోలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అదిరిపోయేలా చేశారు, అదే సమయంలో ట్రైలర్ విడుదల చేసి ఫ్యాన్స్ ని ఖుషీ చేశారు. అభిమానులు ఎంత ఖుషీ అయ్యారో, వైరి వర్గం అంత ఉడుక్కునేలా ఈ సినిమాలో డైలాగులున్నాయి.
‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు మార్చలేరు’. సినిమా ట్రైలర్ లో ఉన్న ఈ డైలాగ్ వింటే కచ్చితంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఎపిసోడ్ గుర్తురాకమానదు. యూనివర్శిటీ పేరులో ఎన్టీఆర్ ని తీసేసి వైఎస్ఆర్ ని యాడ్ చేశారు. దీనిపై గతంలో పెద్ద రాద్ధాంతం జరిగింది. నందమూరి ఫ్యామిలీ అంతా ఏకతాటిపైకి వచ్చి తమ నిరసన తెలిపింది. ఇతర రాజకీయ వర్గాలు కూడా పేరు మార్పుపై మండిపడ్డాయి. కానీ ఎవరూ ఏమీ చేయలేకపోయారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయం అమలులోకి వచ్చింది. చరిత్ర సృష్టించినవారి పేరు ఎవరూ మార్చలేరని, సంతకాలు పెడితే కేవలం బోర్డు మీద పేరు మాత్రమే మారుతుందన్నారు.
పదవి చూసుకుని పొగరా..?
పదవి చూసుకుని నీకు పొగరేమో బై బర్త్ నా డీఎన్ఏ కే పొగరు అంటూ మరో డైలాగ్ ట్రైలర్ లో పేలింది. ఈ డైలాగ్ కూడా ఎవరినో ఉద్దేశించి రాసిందేనని అంటున్నారు కొంతమంది. నేరుగా ఒకరిని టార్గెట్ చేసుకుని ఈ డైలాగ్స్ అన్నీ రాయించారని సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. సినిమాలో మరిన్ని డైలాగులు ఓ పార్టీని టార్గెట్ చేసేలా ఉండబోతాయనే ఊహాగానాలు కూడా వినపడుతున్నాయి.
బుర్రా సాయి మాధవ్ పంచ్ లు..
ఈ సినిమాకి బుర్రా సాయిమాధవ్ మాటలు రాశారు. గతంలో కూడా బాలయ్య సినిమాలకు ఆయన పంచ్ డైలాగురు రాశారు. అవి కూడా బాగా పేలాయి. ఇప్పుడు వీరసింహారెడ్డికి కూడా ఆయన అదిరిపోయే డైలాగులు రాశారని అంటున్నారు. అందులో పొలిటికల్ మసాలా కలిపిన ఇలాంటి డైలాగులు ఇప్పుడు హాలెట్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ డైలాగుల గురించే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు వ్యవహారంలో జరిగిన రచ్చ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ డైలాగులపై ఇప్పటి వరకూ అటు నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. మరికొంత సమయం గడిస్తే అటు నుంచి కూడా కౌంటర్లు పడక మానవు.