మహాశివరాత్రి శివ భక్తులకు మహాపర్వదినం. గరళాన్ని మింగిన శివునికి ఆ మంట నుంచి ఉపశమనం కలిగించేందుకు ఆ రోజున అభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే పరమభక్తితో ఉపవాసాలు ఉంటారు. అయితే ఉపవాసం చేసేటప్పుడు ఆరోగ్యరీత్యా చాలా జాగ్రత్తలు పాటించాలి. కొంతమంది ఉదయం నుంచి రాత్రి వరకు ఎలాంటి ద్రవ,ఘనాహారాన్ని తీసుకోకుండా ఉపవాసం చేస్తారు. పండ్లు కూడా తినరు. ఇది చాలా ఆరోగ్యసమస్యలకు దారితీస్తుంది. అందుకు వైద్యులు కొన్ని సూచనలతో ఉపవాస దీక్షను చేపట్టాలని చెబుతున్నారు.


తగినన్ని ద్రవాలు
ఘనాహారం తీసుకోకుండా ఉపవాసం చేసేవారు ద్రవాహారాన్ని తీసుకోవచ్చు. ఉపవాస దీక్ష చేస్తున్నప్పుడు శరీరంలో నీరు తగ్గకుండా చూసుకోవాలి. శరీరం కొవ్వును, కేలరీలను దాచుకోగలదు కానీ, నీటిని దాచుకోలేదు. నీరు తగ్గితే మాత్రం ఆ ప్రభావం శరీరంపై వెంటనే కనిపిస్తుంది.శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. మెదడుకు ఆక్సిజన్ అందడం తగ్గిపోతుంది.ఫలితంగా తలనొప్పి, అలసట, విపరీతమైన నీరసం, కళ్లు తిరగడం లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ద్రవాహారాన్ని మాత్రం దూరం పెట్టద్దు.  కనీసం నీళ్లయిన ప్రతి గంటకి గుక్కెడు తాగుతూ ఉండాలి. దేవుడు మీ క్షేమాన్నే కోరుకుంటారు కానీ అనారోగ్యాన్ని కాదు. కాబట్టి కఠిన ఉపవాసానికి సెలవిచ్చి నీరు తాగుతూ ఉండండి. శరీరంలోని అవయవాలు దెబ్బతినకుండా కాపాడుకున్నవారు అవుతారు. 


ఆరోగ్యసమస్యలు ఉంటే...
ఆధునిక కాలంలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు అధికం అయ్యాయి. హైబీపీ, మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారు ఉపవాసం జోలికి వెళ్లకపోవడమే మంచిది. మనసు నిండు ఆ శివయ్యను తలచుకుని అభిషేకం చేసి, నైవేద్యాలు సమర్పించి, శివ అష్టోత్తర శతనామావళి భక్తి శ్రద్ధలతో చదివి పూజ ముగించండి. కచ్చితంగా ఉపవాసం చేయాలనుకుంటే మాత్రం వైద్య నిపుణులను సంప్రదించి వాటికి అనుగుణంగా ఎలాంటి మందులు వాడాలో సూచనలు తీసుకోవాలి. 


ఉపవాసం ముగించాక...
ఉపవాసం పూర్తయ్యే సమయానికి పొట్ట ఖళీగా ఉంటుంది. అనేక ఆమ్లాలు అప్పటికే ఊరి పొట్టలో నిండి ఉంటాయి. కొందరిలో గ్యాస్ సమస్య కూడా ఉంటుంది. కనుక పొట్ట నిండా ముందుగా వేడి నీళ్లు తాగడమో లేక కొబ్బరి నీళ్లు తాగడమో చేయాలి. ఉప్పు, పంచదార కలిపిన నిమ్మనీళ్లు తాగినా మంచిదే. తక్షణ శక్తి వస్తుంది. దేవుడి ప్రసాదంగా పెట్టిన అరటిపండుతో ముగిస్తే ఇంకా మంచిది. 


టీ, కాఫీలు వద్దు
ఉపవాసం ఉండే వాళ్లలో టీ, కాఫీలు తాగే వాళ్లు ఉంటారు. ఈ పానీయాలను అధికంగా తాగడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిలోని కెఫీన్ అధికంగా శరీరంలో చేరి కొత్త సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఉపవాసం సమయంలో రెండు సార్లు కన్నా ఎక్కువ ఈ పానీయాలను తాగద్దు.  


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: హైబీపీని సహజంగా తగ్గించే ఆహారాలివి, తింటే ఎంతో మేలు


Also read: బంగాళాదుంపల తొక్కల్లో బోలెడన్నీ పోషకాలు, పొట్టుతో తింటే ఆయుర్ధాయం